Cool Water | ప్రచండమైన ఎండలతో భారతదేశం అల్లాడిపోతున్నది. ఇంటినుంచి అడుగు బయట వేయడం ఆలస్యం ఒంట్లో నీరు హరించుకుపోతున్నది. ఎండల తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. ఎండాకాలంలో మనం సహజంగానే నీళ్లు ఎక్కువగా తాగుతాం. కాబట్టి, శరీరంలో నీరు తగ్గిపోవడం అనే సమస్య ఉత్పన్నం కాదు. కాకపోతే దాహం తీరడానికి, శరీరానికి వెంటనే చల్లదనంతో ఉపశమనం కలగడానికి చల్లటి నీళ్లో లేదంటే ఐస్ వేసిన నీళ్లో తాగుతూ ఉంటాం. మరి మండే ఎండల్లో చల్లటి నీళ్లు ఆరోగ్యమా కాదా అనే విషయంలో సందేహాలు ఉంటాయి. అయితే, మనకు దాహం వేసినప్పుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకుంటామా లేదా చల్లటి నీళ్లు తాగుతామా అనేది పూర్తిగా మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది.
అంతేకాకుండా ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంలోనూ శాస్త్రీయమైన రుజువులు కూడా ఏమీలేవు. ఆయుర్వేదం ప్రకారమైనా, అల్లోపతి ప్రకారమైనా సరే చల్లటి నీళ్లు శరీరం మీద అంత దుష్ప్రభావం ఏమీ కలిగించవు. కాకపోతే, కొన్ని అధ్యయనాల మేరకు చల్లటి నీళ్ల కంటే వెచ్చటి నీళ్లు కొంచెం మంచివి. ఇవి ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తాయట. ఇక ఎండాకాలంలో చల్లటినీళ్లు తాగినా, వేడినీళ్లు తాగినా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలో నీరు తగినంతగా ఉంటే ఒంట్లో పేరుకున్న టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. పైగా శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటానికి సరైన హైడ్రేషన్ తప్పనిసరి. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతుపై ప్రభావం చూపుతాయి. అంతకుమించి ఆరోగ్య సమస్యలేవీ తలెత్తవు.