– జెసిబి, రెండు టిప్పర్లు స్వాధీనం
– పోలీసులకు ఫిర్యాదు
రుద్రంపూర్, మార్చి 18 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలపై ఎస్‌అండ్‌పిసి (సెక్యూరిటీ) సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంది. అనుమతులు లేకుండా మైనింగ్ ప్రాంతంలోకి చొరబడి మట్టిని తరలిస్తున్న ఒక జెసిబి, రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీ రాత్రి సుమారు 2 గంటల సమయంలో పాల్వంచ ప్రాంత నివాసి బాదుల్లాకు చెందిన జెసిబి, రెండు టిప్పర్ల సహాయంతో ధన్‌బాద్ పంచాయతీ మాయాబజార్ ప్రాంతంలో రైల్వే స్లైడింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అక్రమంగా మట్టి లోడింగ్ జరుగుతోంది. విధుల్లో ఉన్న ఎస్‌అండ్‌పిసి సిబ్బంది అనుమానాస్పద కదలికలను గమనించారు. మట్టి డంప్‌కు వెళ్లాల్సిన టిప్పర్ కొత్తగూడెం వైపు మళ్లడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే జమేదార్ విక్టర్, సీతారాం, కప్పల శ్రీనివాస్ వాహనాన్ని వెంబడించి ఆపారు. వాహనం సంబంధిత అనుమతులపై ప్రశ్నించగా డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు.
దీంతో టిప్పర్‌ను సెక్యూరిటీ కార్యాలయానికి తరలించారు. అలాగే రైల్వే పనుల వద్ద లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న మరో టిప్పర్, జెసిబిని కూడా స్వాధీనం చేసుకుని ఆఫీసుకు తరలించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సెక్యూరిటీ అధికారులు తెలిపారు. అక్రమ మట్టి రవాణాపై సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో పనులు చేపడుతున్న సదర్ కంపెనీకి చెందిన కొందరు సూపర్వైజర్ల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వాహనం, తమ జెసిబి కాకుండా వేరే వ్యక్తులు వచ్చి మట్టిని తరలిస్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది ఎందుకు అధికారులకు తెలియజేయలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మొదటిసారి జరిగిందా? లేక నిత్యం జరుగుతున్నదా అనే విషయంపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు.