ఒక రైతు మోటార్ ఆన్ చేయడానికి అర్ధరాత్రి పొలానికి వెళ్లాల్సి వస్తుంది. చీకటి… పాముల భయం, విద్యుత్ షాక్ ప్రమాదం, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి. మరోవైపు,ఎరువులు వేయాలంటే రోజంతా వంగి లేస్తూ నడుము నొప్పులతో అలమటించే కూలీలు. ఈ కష్టాలన్నీ చూస్తూ పెరిగిన ఓ సాధారణ రైతుబిడ్డ మనసులో ఒక ప్రశ్న పుట్టింది. రైతు కష్టం తగ్గించే యంత్రాలు మనమే ఎందుకు తయారు చేయకూడదు? ఆ ఒక్క ఆలోచనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బొమ్మగాని మల్లికార్జున్‌ను వ్యవసాయ పరికరాల ఆవిష్కరణలకు రూపకర్తగా నిలబెట్టింది.
ఇన్నోవేటర్ అయ్యాడంటే అతనేం పెద్ద యూనివర్సిటీలో చదవలేదు. కేవలం పదో తరగతి మాత్రమే పూర్తి చేశాడు. అయినా తన మనసులో ఉన్నది సాధించి రైతులెందరికో చేదోడు వాదోడుగా మారాడు. రాష్ట్రపతి అవార్డునూ అందుకునేంత మంచి ఆవిష్కరణలు చేశాడు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా, ఆజంపేట మండలంలోని అడ్డగూడెం గ్రామానికి చెందిన బొమ్మగాని మల్లికార్జున్ (మల్లేష్). అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
పేదరికం అడ్డుకాలేదు
మల్లేష్ నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి తర్వాత చదువు కొనసాగించలేకపోయాడు. కానీ నేర్చుకోవాలనే తపన మాత్రం తగ్గలేదు. సోలార్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో మూడు నెలల శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నేర్చుకున్న చిన్నచిన్న సాంకేతిక అంశాలను రైతుల సమస్యలను తీర్చే పరిష్కారాలతో జోడించి కొత్త పరికరాలను రూపొందించడం ప్రారంభించాడు. అతని ప్రయోగశాల పెద్ద పరిశోధనా కేంద్రం కాదు… రైతు పొలం. అతని పుస్తకాలు ఖరీదైన టెక్నికల్ మాన్యువల్స్ కాదు… రైతుల అనుభవాలే.
కరెంట్ పోయినా…
రైతులకు ఎక్కువగా ఎదురయ్యే సమస్య విద్యుత్. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకసారి వచ్చిన తర్వాత గంటల తరబడి మోటార్ నడుస్తూ నీరు వృథా అవుతుంది. కొన్నిసార్లు మోటార్ కాలిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లేష్ టైమర్ ఆటో స్టార్టర్ రూపొందించాడు. రైతు ముందుగానే అవసరమైన సమయం సెట్ చేస్తే, కరెంట్ వచ్చిన తర్వాత మోటార్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి నిర్ణయించిన సమయం పూర్తికాగానే ఆఫ్ అవుతుంది. దీంతో… నీటి వృథా తగ్గుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. మోటార్ సురక్షితంగా ఉంటుంది. రైతు రాత్రంతా పొలం వద్ద కాపలా కాయాల్సిన అవసరం ఉండదు. ఒకటి-రెండు కిలోమీటర్ల దూరం నుంచే మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసేలా.. రిమోట్ కంట్రోల్ స్టార్టర్నూ రూపొందించాడు. షార్ట్ సర్క్యూట్ల వల్ల రైతులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలను తగ్గించేందుకు ఇది ఉపయుక్తం.
పశువులను వెతికే టెక్నాలజీ
పశువులను మేత కోసం అడవుల్లో వదిలి పెడుతుంటారు రైతులు. కొన్ని సార్లు అవి తప్పిపోతుంటాయి. అలాంటి ఆవులు, గేదెలు దొరకడం రైతులకు కష్టంగా ఉంటుంది. వాటిని దొంగిలించే వారూ ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి పశువులను రక్షించడానికి మల్లేష్ సోలార్ జీపీఎస్ సిస్టంని కనిపెట్టాడు. దాని ద్వారా అవి ఏ లొకేషన్లో ఉన్నాయో మొబైల్ ఫోన్లో తెలుసుకోవచ్చు. సాంకేతికతను గ్రామీణ రైతుకు దగ్గర చేయాలనే లక్ష్యంతో మల్లేష్ మరో అడుగు ముందుకు వేశాడు. ఫోన్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా మోటార్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయగలిగే పరికరాన్ని అభివృద్ధి చేశాడు. ఈ వ్యవస్థలో, కరెంట్ వచ్చినప్పుడు రైతుకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. కరెంట్ పోయినా సమాచారం వస్తుంది. మోటార్లో లోపం వచ్చినా హెచ్చరిక అందుతుంది. అది కాలిపోకుండా ముందుగానే అప్రమత్తం చేస్తుంది. ఇలా రైతు ఊరిలో లేకపోయినా, వేరే జిల్లాలో ఉన్నా తన మోటార్‌పై నియంత్రణ కొనసాగించగలడు.
ఎరువుల కోసం
వ్యవసాయంలో కనిపించని కష్టం ఎరువులు వేయడంలో ఉంటుంది. ఒకే రోజు వేలసార్లు వంగి, లేచి పని చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పండ్ల తోటల్లో ఇది మరింత కష్టసాధ్యం. ఈ సమస్యను పరిష్కరించడానికి మల్లేష్ ప్రత్యేక ఎరువులు వేసే యంత్రం రూపొందించాడు. ఈ పరికరంతో… కూలీలు నడుస్తూనే పని చేయవచ్చు. ప్రతి మొక్కకు ఒకే మోతాదులో ఎరువు పడుతుంది. పని వేగంగా పూర్తవుతుంది. కూలీల శారీరక శ్రమ గణనీయంగా తగ్గుతుంది.
సమాజం పట్ల ప్రేమ ఉండే ఇలాంటి ఇన్నోవేటర్లే గ్రామీణ భారతానికి అసలైన బలం కదూ! అబ్దుల్ కలాం చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు, నాటి తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా రైతునేస్తం అవార్డులాంటివెన్నో అందుకున్నాడు మల్లేశ్. ఇలాంటి ఆవిష్కర్తలకు సరైన ప్రోత్సాహం, సాంకేతిక మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం లభిస్తే రైతులకు అవసరమైన ఎన్నో స్వదేశీ వ్యవసాయ పరికరాలు తెలంగాణ నుంచే దేశానికి అందే అవకాశం ఉంది.
అమ్మకోసం
2005లో అనారోగ్యంతో అమ్మ మంచం పట్టింది. నేనూ నాన్నా పొలం నుంచి వచ్చేసరికి చీకటి పడ్డా.. ఆమె లైటు, ఫ్యాన్ వేసుకోకుండా అలానే ఉండేది. అప్పుడు టీవీ మెకానిక్ షాపులో పని చేసేవాడిని. అమ్మకోసం రిమోట్ కంట్రోల్‌తో లైట్, ఫ్యాన్ ఆన్ చేసే పరికరం తయారు చేశా. ఇదే నా మొదటి ఆవిష్కరణ. సమాజంలో మా అమ్మలాంటి ఎందరికో ఇది ఉపయోగపడుతున్నది. ప్రస్తుతం నా దగ్గర రైతులకు ఉపయోగపడే మరో 12 ఐడియాలున్నాయి. ఎవరైనా సహకరిస్తే రైతులకు తక్కువ ధరలో మరింత ఉపయోగకరమైన పరికరాలు అందించగలుగుతాను.
– మల్లేష్
– శ్యాంమోహన్ 9440595858