Pakistan : పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులో ఇద్దరు పాకిస్తాన్ చొరబాటుదారుల్ని భారత భద్రత బలగాలు (బీఎస్ఎఫ్) కాల్చిచంపిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పౌరుల్ని కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్.. భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇండియన్ డి అఫైర్స్‌గా పిలిచే డా.సత్యంజల్ పాండే ప్రస్తుతం పాకిస్తాన్, ఇస్లామాబాద్‌లో భారత రాయబారిగా ఉంటున్నారు.
ఆయన తాత్కాలిక రాయబారిగా మాత్రమే అక్కడ కొనసాగుతున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియా.. పాకిస్తాన్లో పూర్తిస్థాయి రాయబారిని నియమించలేదు. తాజా విషయానికొస్తే.. పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో ఇండియా-పాక్ సరిహద్దు ఉంది. ఇక్కడ శుక్రవారం ముగ్గురు పాక్ పౌరులు సరిహద్దు గుండా కంచెదాటి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన బీఎస్ఎఫ్ వారికి హెచ్చరికలు జారీ చేసింది. తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయినప్పటికీ వారు ఇండియా వైపు వచ్చేందుకు ప్రయత్నించారు.
అనేక హెచ్చరికలు చేసినప్పటికీ అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకడు తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే, తమ దేశ పౌరుల్ని బీఎస్ఎఫ్ జవాన్లు అక్రమంగా కాల్చి చంపారు అంటూ పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాయుధులైన వారిపై కాల్పులు జరిపారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ పాక్‌లో ఉన్న ఇండియా రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించింది.