Knee Stiffness | మోకాళ్లు లేదా ఇతర కీళ్లలో అప్పుడప్పుడు శబ్దాలు రావడం, నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు బిగుతుగా అనిపించడం చాలా సందర్భాల్లో సాధారణమే. అయితే ఆ బిగుతు ప్రతిరోజూ కొనసాగుతూ, 15-30 నిమిషాల తర్వాత కూడా తగ్గకపోవడం లేదా నొప్పి, వాపు, వేడి వంటి లక్షణాలు కనిపించడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కీళ్లలో వాపు లేదా ఇతర సమస్యలకు సంకేతాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలిలో చిన్నపాటి క్లిక్ శబ్దం రావడం లేదా నిద్రలేచిన తర్వాత మోకాలు బిగుసుకుపోయినట్లు అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి లక్షణాలు సహజమేనని భావించి చాలామంది పట్టించుకోరు. అయితే నొప్పి, వాపు, కదలికల్లో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటే మాత్రం కారణాన్ని తెలుసుకోవడం అవసరం. కీళ్లు కదిలేటప్పుడు వచ్చే శబ్దాలను వైద్య పరిభాషలో క్రెపిటస్ అంటారు. కీళ్లలోని సైనోవియల్ ద్రవంలో ఏర్పడే గ్యాస్ బుడగలు కూలిపోవడం లేదా ఎముకలపై స్నాయువులు, లిగమెంట్లు కదలడం వల్ల ఈ శబ్దాలు వస్తుంటాయి. కేవలం శబ్దం మాత్రమే ఉండి, దాంతోపాటు నొప్పి, వాపు లేదా కదలిక పరిమితి లేకపోతే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
నిద్రించిన తర్వాత లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్న తర్వాత కీళ్లు బిగుతుగా అనిపించడం సాధారణంగా కనిపించే సమస్యే. కొద్దిసేపు నడవడం లేదా కీళ్లను కదిలించడం ప్రారంభించిన తర్వాత 15 నుంచి 30 నిమిషాల్లో బిగుతు తగ్గితే పెద్దగా ఆందోళన అవసరం ఉండదు. అయితే ప్రతిరోజూ బిగుతు ఎక్కువసేపు కొనసాగడం, క్రమంగా పెరగడం లేదా వాపు, వేడి వంటి లక్షణాలు కనిపిస్తే కీళ్లలో వాపు ఉండే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మోకాలిలో నిరంతరం లేదా క్రమంగా పెరుగుతున్న నొప్పి, మోకాలు ఎర్రగా మారడం, వాపు లేదా వేడిగా అనిపించడం, మోకాలిని పూర్తిగా వంచడం లేదా చాపడంలో ఇబ్బంది, మోకాలు లాక్ అవుతున్నట్లు లేదా జారిపోతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా కదలికలు పరిమితం కావడం, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పడిపోవడం వల్ల గాయం కావడం కూడా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలే.
మోకాలి వాపుతో పాటు జ్వరం రావడం మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి. ఇది కీళ్లలో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం. కీళ్ల ఆరోగ్యానికి జీవనశైలి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కీళ్లను పూర్తిగా విశ్రాంతిలో ఉంచడం మాత్రమే పరిష్కారం కాదు. కీళ్లకు మద్దతుగా ఉండే కండరాలను బలోపేతం చేయడంతోపాటు నడక, ఈత, సైక్లింగ్ వంటి తగిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల కీళ్లు చురుకుగా, బలంగా ఉండేందుకు సహాయపడతాయి. మోకాలి నొప్పి లేదా ఇతర లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగినా, రోజువారీ పనులకు ఆటంకం కలిగించినా వైద్యులను సంప్రదించడం మంచిది. అవసరాన్ని బట్టి వైద్యులు శారీరక పరీక్షతోపాటు ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి పరీక్షలను సూచిస్తారు. తద్వారా సమస్యకు సరైన కారణాన్ని గుర్తించి తగిన చికిత్సను ప్రారంభించవచ్చు.
మోకాళ్లలో వచ్చే ప్రతి శబ్దం ప్రమాదకరమైంది కాదు. అలాగే వయసుతోపాటు కొంత బిగుతు రావడం కూడా సాధారణమే. కానీ నొప్పి, వాపు, వేడి, కదలికల్లో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా తోడైతే దాన్ని సాధారణ సమస్యగా భావించి వాయిదా వేయకూడదు. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా ఫిజియోథెరపీ, తగిన వ్యాయామాలు, బరువు నియంత్రణ, అవసరమైన మందులు వంటి చర్యలతో లక్షణాలను నియంత్రించవచ్చు.