ఆళ్లపల్లి, ఆగస్టు 15: దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉండగా.. ఆళ్లపల్లి మండలంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం, చికెన్ అమ్మకాలు చేపట్టారు. రాష్ట్రమంతటా వైన్ షాపులు, చికెన్.. మటన్ దుకాణాలు బంద్ కాగా.. ఆళ్ళపల్లి, మర్కోడు గ్రామాల్లో మాత్రం కొందరు ప్రభుత్వ ఆంక్షలకు తూట్లు పొడిచారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమల్లో ఉన్న నిబంధనలను పట్టించుకోకుండా కొన్ని మద్యం దుకాణాలు, చికెన్ షాపులు తెరిచి ఉంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంక్షలు కాగితాలకే పరిమితమా? పంద్రాగస్టు వంటి ప్రత్యేక రోజుల్లో మద్యం విక్రయాలపై ప్రభుత్వం విధించే ఆంక్షలను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంతో యథేచ్చగా కొందరు వ్యాపారాలు సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చికెన్ షాపులు సైతం తెరిచిన దాఖలాలు ఉన్నాయి. దాంతో, అధికారుల నిఘా ఎక్కడ? ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవం రోజునే నిబంధనల ఉల్లంఘన జరుగుతుంటే.. సాధారణ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించానలి కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలకు విలువ లేదా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తారా? లేదా వేచి చూడాలి మరి.