ఖైరతాబాద్ మహాగణపతిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
– ఖైరతాబాద్, సెప్టెంబర్ 23
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. మండపాల్లో విశిష్ట పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గణపతి బప్పా మోరియా.. అంటూ.. గణనాథుడి నామస్మరణతో నగరం మార్మోగనున్నది. శుక్రవారం ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ సహా వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు భారీ గణనాథుల శోభాయాత్ర అత్యంత వైభవంగా జరగనున్నది. ఈ మేరకు నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బల్దియా అన్ని చర్యలు చేపట్టింది. హుస్సేన్‌సాగర్ వద్ద 280 క్రేన్లను ఏర్పాటు చేశారు. పోలీసు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇదిలా ఉంటే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు బుధవారం రాత్రి ముగిశాయి. గురువారం నుంచి నిమజ్జన ప్రక్రియ మొదలుకానున్నది. 25న జరిగే బడాగణేశ్ నిమజ్జన ఘట్టాన్ని వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌కు 700 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా, 10వేల కెమెరాలు..24 అత్యాధునిక డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సర్వం సిద్ధమైంది. మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చెరువులు, బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన కోలాహలం నెలకొంది. ఇందులో భాగంగా నిమజ్జన ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే భారీ గణనాథుల శోభాయాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనున్నది.
– సిటీబ్యూరో, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్‌లో ఈనెల 25న జరిగే మహానిమజ్జన శోభాయాత్రకు సిటీ పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గణేశ్ నిమజ్జన బందోబస్తులో 20వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.శోభాయాత్రకు ఈసారి ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ ప్రకటించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరంలో గణేశ్ నిమజ్జనానికి పోలీసుశాఖ ఏర్పాట్లు, బందోబస్తుపై సజ్జనార్ వివరించారు.
ఇప్పటికే నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుండగా, రేపు జరిగే బాలాపూర్ గణేశ్ శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్ సిటీ, ఇతర జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాదిమంది భక్తులు, వేలాది విగ్రహాల రాకను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు ఖైరతాబాద్ గణేశ్‌ను 25లక్షల మంది, బాలాపూర్ వినాయకుడిని 15లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, చివరిరోజు మరింత మంది పెరిగే అవకాశమున్నదందున అక్కడ మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు.
విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది.
280 క్రేన్ల ఏర్పాటు
చెరువులు, బేబీ పాండ్స్ వద్ద నిమజ్జనం సులభంగా జరిగేలా 110 స్థిర (స్టాటిక్), 170 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. 136 గణేశ్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయగా, శోభాయాత్ర మార్గాల్లో ప్రతి 3 నుంచి 4 కిలోమీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒకో టీమ్‌లో 1 శానిటరీ సూపర్ వైజర్, 3 ఎస్ఎఫ్ఏలు, 21 మంది కార్మికులు విధులు నిర్వర్తించనున్నారు. పోలీసు శాఖతో కలిసి 12 జాయింట్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర సమయం లేదా సమాచారం కోసం డయల్ 112 లేదా 040-2111 1111 నంబర్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జన పాయింట్ల వద్ద 770 మంది పారిశుధ్య కార్మికులు రౌండ్ ది క్లాక్ పనిచేస్తారు. వీరికి అదనంగా మరో 6,000 మంది స్వీపింగ్ సిబ్బంది చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎప్పటికప్పుడు వ్యర్థాల తరలింపు
చెత్త తరలింపునకు సాధారణ వాహనాలతో పాటు 42 మినీ టిప్పర్లు, 10 జేసీబీలను రంగంలోకి దించనున్నారు. భక్తుల సౌకర్యార్థం 287 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఊరేగింపు మార్గాల్లో చెట్ల కొమ్మల నరికివేత కోసం సరిల్కు ఒకటి చొప్పున విపత్తు నిర్వహణ బృందాలు 24/7 పనిచేయనున్నాయి. నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో 43,270 తాతాలిక లైట్లను ఏర్పాటు చేసి, 100% వెలుగులు ఉండేలా నిఘా ఉంచుతున్నారు. వైద్యారోగ్య శాఖ సమన్వయంతో అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ, ఎకడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
బడాగణేశ్ దర్శనం ముగింపు
బుధవారం అర్ధరాత్రి తరువాత నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం బంద్ చేశామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ గణేశ్ నిమజ్జనానికి సంబంధించి సాంకేతికంగా పనులు చేపట్టడానికి కనీసం 36 గంటలు పడుతుందని, శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం ఉదయం నుంచే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్మార్గ్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించబోమని ఈ కారణంగా ప్రజలు తమ ప్రయాణాలను ముందుస్తుగా ప్లాన్ చేసుకోవాలన్నారు.
శోభాయాత్రకు ఏర్పాట్లు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం బుధవారం రాత్రి ముగిసింది. 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తైన మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. గడిచిన పది రోజుల్లో సుమారు 30లక్షలకు పైగా భక్తులు దర్శనం చేసుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పది రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడిని నేడు నిమజ్జనానికి సిద్ధం చేస్తారు. గురువారం అర్ధరాత్రి తుది పూజలు నిర్వహించి స్వామి వారిని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు.
రేపు మద్యం దుకాణాలు బంద్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగా ణ): వినాయక నిమజ్జనం వేళ మద్యం దుకాణాలను మూసివే యాలని పోలీసు లు ఆదేశాలు జారీ చేశారు. ప్యూచర్ సిటీలో 25వ తేదీన ఉదయం 6 నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ప్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు.
ట్యాంక్‌బండ్‌కు 700 ప్రత్యేక బస్సులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 ( నమస్తే తెలంగాణ ): ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనోత్సవానికి శుక్రవారం ట్యాంక్‌బండ్‌ను సందర్శించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 700 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టు పక్కల ప్రాంతాలైన బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, టీటీడీ కల్యాణ మండపం, ఇందిరాపార్క్, లక్డీకపూల్, ఆల్ ఇండియా రోడ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల నుంచి నగరంలోని నలువైపులకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయని వివరించారు. ఒక్కో డిపో నుంచి 15 నుంచి 25 బస్సుల వరకు కేటాయించినట్టు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 32878 విగ్రహాల నిమజ్జనం
నగరవ్యాప్తంగా మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా 15426 దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అనంతరం 14929 మండపాలకు అనుమతులు మంజూరు చేశామని, అనుమతి పొందిన అన్ని మండపాలకు జియోట్యాగింగ్ చేయడంతో పాటు ప్రమాద నివారణ, విద్యుత్ తీగల రక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 38,878 విగ్రహాలను నిమజ్జనం చేశామన్నారు. అందులో నగరానికి చెందిన 6,108 విగ్రహాలు ఉన్నాయన్నారు. గత 24 గంటల్లోనే నగర పరిధిలోని 2161 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దం చేసే పరికరాల వినియోగంపై నిషేధం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మహిళల భద్రత కోసం 26 షీటీమ్స్‌ను ఏర్పాటు చేసి వారు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ఈనెల 14 నుంచి ఇప్పటివరకు 1172 మంది ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. నేర నియంత్రణ కోసం సీసీఎస్ నుంచి 25 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఆయన తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రధాన కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని నగర సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
20 వేల మందితో నిఘా
ఈనెల 25న వేలాది విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని చెప్పిన సజ్జనార్ ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగే శోభాయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాల్లో 10వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానించామని సజ్జనార్ తెలిపారు. జరిగే శోభాయాత్ర స్థితిగతులు తెలుసుకునేందుకు వీలుగా 24 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నామని, ప్రధాన మార్గాల్లో 100 హైరైజ్డ్ కెమెరాలను వినియోగిస్తున్నామని వీటి ద్వారా విగ్రహాల లెక్కింపును చేపట్టామన్నారు.
నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రధాన ప్రాంతాల్లో ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. గణేశ్ నిమజ్జనం కోసం 8142 మంది అదనపు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని, 42 ప్లాటూన్లతో పాటు నాలుగు ఆర్ఏఎఫ్, రెండు సీఆర్పీఎఫ్ కంపెనీల కేంద్రబలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. అనుమానాస్పద కదలికలు, పేలుపదార్థాల తనిఖీల కోసం 53 బాంబుడిస్పోజల్ బృందాలు అందుబాటులో ఉంటాయని సజ్జనార్ చెప్పారు. నిమజ్జనం జరిగే జలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు సిద్ధ్దంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు, జనరేటర్లను అందుబాటులో పెట్టామన్నారు.
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

Traffic
నగరంలో ఈనెల 25న వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపును సందర్భంగా ప్రయాణాల రద్దీని నివారించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేక రవాణా ఆంక్షలు , మళ్లింపులను ప్రకటించారు. ఈనెల 25 ఉదయం 6 నుంచి 26 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, పరిస్థితి బట్టి సమయాన్ని పొడిగించే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్య ఊరేగింపు బాలాపూర్ వినాయక మండపం నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట వంతెన, ఫలక్‌నుమా, ఆలీయాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మహారాజాగంజ్ మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గం, పీవీఎన్ఆర్ మార్గం వైపు సాగుతుంది.
సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, తార్నాక, టోలీచౌకి, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, రాంనాథ్పూర్ మొదలైన ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు నిర్దేశిత అనుబంధ మార్గాల ద్వారా వచ్చి ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. ఊరేగింపు సాగే ముఖ్య మార్గాల్లో నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతర సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించేది లేదని సీపీ స్పష్టం చేశారు. ముఖ్య ఊరేగింపు సాగేదారుల్లో దానికి అనుసంధానంగా ఉన్న రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిరోధించి ఇతర మార్గాల్లోకి మళ్లిస్తారు.
తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పునకు దాటడానికి బషీర్‌బాగ్ కూడలి వద్ద మాత్రమే వెసులుబాటు కల్పించబడిందని, వాహనదారులు ఇన్నర్రింగురోడ్డు, మసాబ్‌ట్యాంక్-పంజాగుట్ట-బేగంపేట-సికింద్రాబాద్ మార్గం లేదా ఓఆర్ఆర్ వినియోగించుకోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ మండలాల పరిధిలోని పలు కీలక కూడళ్ల వద్ద వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయి. భారీ వాణిజ్య వాహనాలు, సరుకుల లారీలు నగరంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని, వాటిని నగరశివారులోనే నిలిపివేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తామని తెలిపారు. ప్రైవేటు రవాణా బస్సులు ఈనెల 26 మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలోకి ప్రవేశించకుండా ఓఆర్ఆర్ నుంచే నడవాల్సి ఉంటుందని, ఆర్టీసీ నగర బస్సులు ఊరేగింపు తీవ్రతను బట్టి మసాబ్‌ట్యాంక్, వీవీ విగ్రహం, సికింద్రాబాద్ క్లాక్‌టవర్, తార్నాక, దిల్సుఖ్నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాలవరకే అనుమతిస్తామన్నారు.
జిల్లాల నుంచి వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌కు చేరుకోవడానికి ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. ఎన్టీఆర్ మార్గ్, ఎగువ చెరువుగట్టు, పీవీఎన్ఆర్ మార్గాల్లో నిమజ్జనం పూర్తయిన ఖాళీ లారీలు, ట్రక్కులు తిరుగు ప్రయాణం కోసం కేటాయించిన ఎగ్జిట్ల ద్వారానే వెళ్లాలని,నిమజ్జనాన్ని వీక్షించడానికివచ్చే భక్తులు తమ వాహనాలను ఎన్టీఆర్ గ్రౌండ్స్, కట్టమైసమ్మ ఆలయం రోడ్డు, ప్రభుత్వ ఉద్యానవనం, ఖైరతాబాద్ రైల్వేస్టేషన్, ఖిల్వత్ మైదానంలలో నిర్దేశిత స్థలాల్లో పార్కింగ్ చేయాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు లేదా వచ్చేవారు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, చెరువుగట్టు రహదారులను పూర్తిగా నివారించి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఓఆర్ఆర్ను ఉపయోగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు బేగంపేట, ప్యారడైజ్, సంగీత్ జంక్షన్ మార్గాలు ఎంచుకోవాలని జోయల్ డేవిస్ తెలిపారు.