న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)పై వివాదం నడుస్తున్న వేళ భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లోనే ఈ ప్రక్రియపై అసమ్మతి నెలకొన్న విషయం బహిర్గతమైంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ‘సర్’ ప్రక్రియపై పదేపదే అసమ్మతి వ్యక్తం చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఒక వార్తాకథనంలో వెల్లడించడం రాజకీయంగా పెను దుమారం రేపింది. దీంతో విపక్ష పార్టీల నాయకులు ఈసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఫారమ్ 6లో మార్పులు, ఓటర్ల జాబితా డాటా కేంద్రీకరణకు సంబంధించిన ఆందోళనలు సహా 10 నెలల వ్యవధిలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధూ, వివేక్ జోషి కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇద్దరూ కూడా ఫారమ్ 6లోని మార్పులను చట్టవిరుద్ధం, అనధికారికం అని పేర్కొంటూ అభ్యంతరం తెలిపారు. అలాగే, 1960 ఓటర్ల నమోదు నిబంధనలకు సవరణలు చేయకుండా చట్టబద్ధమైన ఫారమ్‌ను మార్చలేమని వారు వాదించారు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ మార్పులను తొలగించలేమని సంధూ ఆ తర్వాత తన అభ్యంతరాన్ని నమోదు చేశారని కథనం పేర్కొన్నది. ఈసీఐ చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) అనే ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియపై ప్రతిపక్షానికి, అధికార బీజేపీకి మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఈ అంశం ఒక కొత్త, మరింత ఉద్రిక్తమైన పరిస్థితిని ఆవిష్కరించింది.

Election Commissioners
జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించి జైల్లో పెట్టాలి
ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలతో ఆగ్రహించిన ప్రతిపక్ష పార్టీలు బుధవారం ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఎన్నికల సంఘాన్ని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నడుపుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆయనను అభిశంసించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే అధికార బీజేపీ మాత్రం ఎన్నికల సంఘం పనితీరును సమర్థించింది. అధికారిక చర్చల్లో ఎన్నికల కమిషనర్లు భిన్నమైన అభిప్రాయాలను పంచుకోవడం ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నదని చూపిస్తున్నదని, అలాగే అది నిరంకుశ వైఖరితో పనిచేస్తున్నదన్న విపక్ష పార్టీల ఆరోపణలను ఇది ఖండిస్తున్నదని బీజేపీ వాదించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తన ఓట్ చోరీ ఆరోపణను పునరుద్ఘాటిస్తూ దానిని దేశద్రోహ చర్యగా, దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరంగా అభివర్ణించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈసీ దేశద్రోహానికి పాల్పడ్డాయని రాహుల్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను జైలుకు పంపాలని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సీఈసీపై అభిశంసన చేపట్టాలని టీఎంసీ(మమత వర్గం) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ కోరారు. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేందుకు 73 మంది ప్రతిపక్ష రాజ్యసభ ఎంపీలు ఈ ఏడాది ఏప్రిల్ 24న సెక్రటరీ జనరల్‌కు కొత్త తీర్మాన నోటీసును సమర్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంట్ వర్ష్షాకాల సమావేశాలు ఇంకా ముగియలేదు.
ఆ పెండింగ్‌లో ఉన్న నోటీసుపై రాజ్యసభ చైర్మన్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా అని ఖర్గే ప్రశ్నించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశం సమాధానం కోరుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించని సమయంలో ఏర్పడిన ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమైనవని, ఆ సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్నోలో అన్నారు. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని సీపీఎం కూడా డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా తొలగింపు వ్యవహారంపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు.
బెంగాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలి: మమత
పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలని కోరిన మమత బెంగాల్‌ను చేజిక్కించుకుని టీఎంసీ ప్రభుత్వాన్ని కూలదోయడానికే సర్ ప్రక్రియ ప్రారంభమైందని ఆమె చెప్పారు. ఎన్నికల సంఘం సహాయంతో కుట్రలు చేసి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. సర్ ప్రక్రియకు ముందు బీజేపీ ఐటీ సెల్ అధికారి సీమా ఖన్నా ఏఐ సహాయంతో 58 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, అలాగే సర్ ప్రక్రియ సమయంలో మరో 34 లక్షల పేర్లు తొలగించారని ఆమె పేర్కొన్నారు.
ఆ ఐదు రాష్ర్టాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలి
బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బుధవారం ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేసే ప్రతిపక్షం సామర్థ్యాన్ని బలహీనపరిచేలా ఎన్నికల నిబంధనలను మార్చారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరును ఆయన ప్రశ్నించారు. ఓటింగ్, లెక్కింపు రికార్డులను భద్రపరిచే కాలపరిమితిలో మార్పులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన తేజస్వి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని పిలుపునిచ్చారు.
విభేదాలు మామూలే: ఈసీఐ
సర్ ప్రక్రియలోని వివిధ అంశాలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పత్రికలో వచ్చిన కథనంపై ఈసీఐ స్పందిస్తూ చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజమేనని పేర్కొంది. ఈ కథనం కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నదని ఈసీఐ తెలిపింది. ఏ సంస్థలోనైనా చర్చల ప్రక్రియలో భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు ఉండటం సహజం. తుది నిర్ణయం తీసుకునే ముందు జరిగే నిర్ణయ ప్రక్రియలో ఇవి ఒక భాగం అని ముగ్గురు కమిషనర్ల సంతకాలతో వెలువడిన ప్రకటన పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి కమిషనర్లు ఆ సూచనలు చేశారని తన ప్రకటనలో ఈసీఐ స్పష్టం చేసింది. ముసాయిదా దశల్లో కమిషన్ సభ్యులు లేవనెత్తిన కార్యకలాపాలకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఓటర్ల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో కూడిన ప్రామాణిక పరిపాలనా విధానంలో భాగమేనని ఈసీఐ పేర్కొంది. సర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని నొక్కిచెప్పడానికి ఈసీఐ తన ప్రకటనలో ప్రయత్నించింది.