Jurala project | జూరాల రైతు జయభేరి.. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల
సాగునీటి పోరాటంలో జూరాల రైతులు సర్కార్‌పై విజయం సాధించారు. వారం, పది రోజుల నుంచి గద్వాల, వనపర్తి జిల్లాల్లో అన్నదాతలు చేస్తున్న నిరవధిక ఆందోళనలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మరోవైపు జూరాల రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన డైవర్షన్ డ్రామాలన్నీ పటాపంచలయ్యాయి.
- సర్కార్ మెడలు వంచిన అన్నదాతలు
- వరుస ఆందోళనలకు దిగొచ్చిన ప్రభుత్వం
- కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల
- భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్
- లిఫ్టులకూ కొనసాగుతున్న నీటి సరఫరా
- రక్తికట్టని కాంగ్రెస్ కర్ణాటక రాజకీయం
- మంత్రుల డైవర్షన్ డ్రామాలు పటాపంచలు
- రైతు ఉద్యమం స్ఫూర్తిదాయకం : కేటీఆర్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగునీటి పోరాటంలో జూరాల రైతులు సర్కార్‌పై విజయం సాధించారు. వారం, పది రోజుల నుంచి గద్వాల, వనపర్తి జిల్లాల్లో అన్నదాతలు చేస్తున్న నిరవధిక ఆందోళనలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మరోవైపు జూరాల రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన డైవర్షన్ డ్రామాలన్నీ పటాపంచలయ్యాయి. జూరాలకు నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కలిసి మంత్రుల బృందం చేసి రాజకీయం కూడా రక్తికట్టకపోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నది. దీంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రాకముందే అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ప్రాజెక్టు కిందిస్థాయి సిబ్బందితో తూములను తెరిపించాల్సి వచ్చింది.
బుధవారం ఉదయం జూరాల కుడి, ఎడమ కాలువలతోపాటు సమాంతర కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఎట్టకేలకు రైతుల పోరాటం ఫలించి ప్రభుత్వం దిగొచ్చి జూరాల ఆయకట్టును కాపాడే దిశగా కాలువలకు నీళ్లు విడుదల చేయడంతో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా రైతులను అభినందిస్తున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న లిఫ్టులకు కూడా ఎత్తిపోస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అవుట్ ఫ్లో మాత్రం 2,626 క్యూసెక్కులుగా ఉన్నది. కర్ణాటక నుంచి ప్రతిరోజు 7వేల క్యూసెక్కుల చొప్పున నెల రోజులపాటు విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరామని, త్వరలో నీటి విడుదల ప్రారంభమవుతుందని మంత్రుల బృందం ప్రకటించింది.
జూరాల నుంచి నీటి విడుదల
జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు ఉదయం 8గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు తూములను తెరిచి నీటిని విడుదల చేశారు. కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సమాంతర కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం తర్వాత జూరాల ప్రాజెక్టు అనుబంధ నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని ఎత్తిపోశారు. మళ్లీ ఏమైందో ఏమో గానీ సాయంత్రం వరకు భీమా ఫేస్ వన్ నెట్టెంపాడు పథకాలకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమాకు 700 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. జూరాల కాలువలకు నీటి విడుదలతో రైతులు సంతోషం వెల్లివిరుస్తున్నది.

బెడిసికొట్టిన కాంగ్రెస్ కర్ణాటక రాజకీయం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా జలాలను ఒడిసిపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం అనేక తంటాలు పడుతున్నది. లిఫ్టులకు కరెంటు సరఫరా నిలిపివేసి మోటర్లు నడువకుండా ఆదేశాలిస్తున్నారు. మరోవైపు నిరంతరం నడువాల్సిన మోటర్లను ఆన్, ఆఫ్ చేస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారు. చివరికి ఏపీ సర్కార్ ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తరలించే దాకా రేవంత్ ప్రభుత్వం చోద్యం చూసింది. పైగా ఏపీ జలదోపిడీ నుంచి డైవర్ట్ చేసేందుకు ఎల్ నినోను సాకుగా చూపుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కుట్రలు మొదలుపెట్టారు.
మరోవైపు జూరాల కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమని తేల్చి చెప్పి తాగునీటి కోసం రిజర్వ్‌లో ఉంచుతామని రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. రైతుల ఆందోళన తీవ్రతరం కావడం, బీఆర్ఎస్ కూడా మద్దతు తెలియడంతో పోరాటం మరింత ముదిరింది. ఇక నీటి విడుదల తప్పదని భావించిన తరుణంలో కర్ణాటక డ్రామా మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా రైతాంగం నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో హుటాహుటిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి బెంగళూరుకు వెళ్లి అక్కడి సీఎంను కలిసి వచ్చారు. ఈ లోపే కృష్ణా నదికి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిగా నిండిపోతుండటంతో చేసేది లేక అధికారులు హుటాహుటిన నీటిని మళ్లించారు. కర్ణాటక నుంచి రాగానే తామే గేట్లు ఓపెన్ చేసినట్టు బిల్డప్ ఇవ్వాలనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లుతూ ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టు లెవెల్ మించి పోతుందని విద్యుత్తు అవసరాలకు వాడితే నేరుగా కిందికి వెళ్తాయని భావించి నీటిని విడుదల చేశారు.
సాగునీటి విడుదలపై మంత్రులకు అవగాహన లేదు: చిట్టెం
అమరచింత, సెప్టెంబర్ 23 : సాగునీటి విడుదలపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని వారం రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కనీసం జిల్లా మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ , అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కండ్లముందే పంటలు ఎండిపోతుంటే కడుపుమండిన రైతులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. సాగునీటి విడుదలపై బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమనే హెచ్చరికతో రాత్రికి రాత్రే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారని చెప్పారు. ఇప్పడేమో సాగునీటిని తీసుకొచ్చామని మాట మారుస్తున్నారని విమర్శించారు.
రైతుల పోరాట ఫలితమిది: శ్రీనివాస్‌గౌడ్
జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదలతో రైతుల పోరాటం ఫలించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఎగువ నుంచి వరద వస్తున్నా నీటిని విడుదల చేయకుండా ఆయకట్టు రైతుల పంటలను ఎండగొట్టేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలను వదిలినట్టే కృష్ణా జలాలను కూడా ఏపీకి ధారాదత్తం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరును ఎండబెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఒక మంత్రేమో పంటలు ఎవరు వేసుకోమన్నారని అంటడు.. మరోమంత్రి తాగడానికి తప్ప సాగునీటికి కాదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఆయన దుయ్యబట్టారు. జూరాల ఆయకట్టు కింద 4-5లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం కావాలనే నీటి విడుదలలో జాప్యం చేసిందని విమర్శించారు. వారం, పది రోజుల నుంచి రైతులు నిద్రాహారాలు మాని రోడ్లమీద ఆందోళనలు చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పట్టనట్టు వ్యవహరించారని నిప్పులుచెరిగారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలక తప్పదని.. కృష్ణా జలాలను ఏపీకి వదిలిపెట్టి పాలమూరుకు అన్యాయం చేసిన రేవంత్‌కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.
ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
రైతుల ఆందోళనలకు తలొగ్గి ప్రభుత్వం నీళ్లివ్వాల్సి వచ్చిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్లలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జూరాల ఆయకట్టుకు సాగునీటి కోసం రైతులు చేసిన పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తంచేశారు. ఎనిమిది రోజుల రైతుల ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చిందని.. ఇది ముమ్మాటికీ జూరాల రైతుల విజయమని చెప్పారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులను కాంగ్రెస్ సర్కార్ గందరగోళానికి గురిచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జూరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వానకాలం సాగు పూర్తయ్యే వరకు నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతీతంగా రైతులకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కృష్ణాలో వరద ప్రారంభమైనపుడు కూడా బీఆర్ఎస్ ధర్నా పిలుపుతోనే రైతులకు సాగునీరు వచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తుచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

