హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇందిరమ్మ పేరుమీద సాగిస్తున్న మహాద్భుత పాలనలో మరో విస్మయకర విషయమిది! ఇకపై మీరు ఎక్కడ, ఏ పాటలు పెట్టుకోవాల్నో పోలీసు శాఖే నిర్ణయించబోతున్నది. సీపీ సజ్జనార్ తాజా ప్రకటన ప్రభుత్వ అసహనాన్ని, పోలీసుశాఖ అత్యుత్సాహాన్ని మరోసారి వెల్లడించింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఆ పాటల ప్లే చేసిన వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టిన హ్యాండిల్స్‌ను ఐడెంటిఫై చేస్తున్నామని బాహాటంగానే బెదిరింపులకు దిగారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కేసీఆర్ పాటలు పెడుతున్న వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తన స్వామిభక్తిని చాటుకునేందుకు ఏనాడూ వెనుకాడని అధికారిగా పేరున్న సీపీ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం.రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాల్లో కేసీఆర్ గారి పాటలు మార్మోగాయి. ప్రత్యేకించి, హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద అటు కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, ఇటు అమరజ్యోతి వాటిమధ్య గుండా వినాయక శోభాయాత్ర పోతున్నప్పుడు యువత, మహిళలు కేసీఆర్ పాటలు పెట్టి నృత్యాలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా, ఈ వీడియోలే కనిపించాయి.
ఉలిక్కిపడిన రేవంత్ సర్కార్.. ఆ మార్గంలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. డీజేలను నిషేధించింది. వచ్చిన అక్కడ నిలుపనీయకుండా, వాహనాలను వచ్చినట్టు బలవంతంగా ముందుకు పంపిస్తున్నది. కొందరు పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టిన యువకులను లాఠీలతో కొడుతున్న వీడియోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఆ పిల్లచేష్టలు.. జనం మదిలోంచి కేసీఆర్‌ను చెరపలేకపోయాయి. కేసీఆర్ చేసిన మంచి కండ్లముందు కనిపిస్తుంటే, ఆయనపై అభిమానం ఉప్పొంగుతుంటే.. రెట్టించిన ఉత్సాహంతో యువతీయువకులు కేసీఆర్ పాటలు పాడుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆత్మన్యూనతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం తరఫున హైదరాబాద్ సీపీ సజ్జనార్ రంగంలోకి దిగినట్టున్నారు.
బుధవారం మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధామిస్తూ పాటల ప్రస్తావన తెచ్చారు. ‘గణేశ్ నిమజ్జనంలో రాజకీయ పాటలు పెడుతున్నవారిపై మేం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరెవరు పాటలు పెడుతున్నారో డాక్యుమెంట్ చేశాం. వాటి వెనుక ఎవరున్నారనే సమాచారం తీసుకుంటున్నాం. ఆ వీడియోలు పోస్టు చేస్తున్న సోషల్‌మీడియా హ్యాండిళ్ల వివరాలనూ సేకరిస్తున్నాం’ అని సజ్జనార్ తెలిపారు. అయితే పోలీసుల అతిపై సోషల్‌మీడియాలో ప్రజలు విరుచుకుపడుతున్నారు. వినాయక నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాల్నో కూడా పోలీసులే నిర్ణయించడమేమిటని వారు మండిపడుతున్నారు.