ఆంధ్రప్రదేశ్ యువతి దీప్తి శ్రీరంగం జాతీయ స్థాయిలో సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించిన ‘మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా 2026’ పోటీలలో ఆమె ప్రతిష్టాత్మకమైన కిరీటాన్ని కైవసం చేసుకుంది. గత ఏడేళ్లుగా ఫ్యాషన్ రంగంలో ఎంతో పట్టుదలతో, కఠిన శ్రమతో రాణిస్తున్న దీప్తి, దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 500 మందికి పైగా పోటీదారులను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటీమణులు మౌనిక కలాపాల, నక్ష శరన్ తో పాటు డాక్టర్ అక్షయ, ప్రణూప్ జవహర్ వ్యవహరించి, అభ్యర్థుల ప్రతిభను అత్యంత నిశితంగా పరిశీలించారు.
కేవలం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వకుండా, మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం మరియు భారతీయ ఐక్యతను చాటిచెప్పే లక్ష్యంతో ఈ షోను నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి ఫైనలిస్ట్ తమ సొంత రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసిన ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దీప్తి శ్రీరంగం ప్రదర్శించిన వ్యక్తిత్వం, స్టేజ్ ప్రెజెన్స్ మరియు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన జ్యూరీ సభ్యులు ఆమెను విజేతగా ప్రకటించారు. భవిష్యత్తులో కిడ్స్ మరియు టీనేజర్స్ విభాగాల్లో కూడా మరిన్ని ఫ్యాషన్ షోలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. అతిథిగా వచ్చిన కోటి గారు మాట్లాడుతూ, మహిళలు తమ సంస్కృతిని కాపాడుకుంటూనే ఫ్యాషన్ రంగంలో రాణించడం గర్వకారణమని, ఇలాంటి వేదికలు మహిళల్లో దాగున్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్తాయని ప్రశంసించారు. దీప్తి సాధించిన ఈ విజయం ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు.