వెంగళరావునగర్, మే 14: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి కత్తితో దాడికి(Knife attack) పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్(SR Nagar) పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్ నగర్‌లోని అశోక్ కాలనీకిక చెందిన మహ్మద్ అహ్మద్ ఖాన్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన మిత్రులైన ఖలీమ్, సయ్యద్, జాహిద్లతో కలిసి అమీర్‌పేట ప్రాంతానికి టీ తాగేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ మార్గమధ్యలో బీకేగూడ వద్ద కూరగాయల సంతలో నిమ్మకాయల వ్యాపారం చేసే అమీన్‌ను కలిశారు.
అహ్మద్ ఖాన్ మిత్రుడైన ఖలీమ్ వద్ద గతంలో అమీన్ రూ.5 వేలు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. అహ్మద్ ఖాన్, ఖలీమ్‌లు ద్విచక్ర వాహనం పై తిరిగి వెళ్లబోగా కోపంతో అమీన్ జేబులో నుంచి కత్తి తీసుకుని అహ్మద్ ఖాన్ పై దాడికి పాల్పడ్డాడు. అహ్మద్ ఖాన్‌కు కత్తిపోట్లకు గురయ్యాడు. బాధితుడిని దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.