మల్యాల, మార్చి 3 : కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యం మితిమీరుతున్నది. అడిగేవారు లేక ఇష్టారాజ్యం నడుస్తున్నది. మల్యాల మండల కేంద్రం నుంచి గుడిపేట రోడ్డుకు శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా అసలు పనులే ప్రారంభించకపోవడం అలసత్వానికి అద్దంపడుతున్నది. మల్యాల మండల కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న గుడిపేట కొత్త పంచాయతీగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, మండల కేంద్రం నుంచి గుడిపేటకు రోడ్డు నిర్మాణానికి సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ అఫ్ రూరల్ రోడ్స్) నిధులు 1.35 కోట్లు మంజూరు కాగా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2024 నవంబర్ 26న భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కానీ, పదహారు నెలలు గడిచినా పనులు ఒక్క మీటర్ రోడ్డు కూడా నిర్మించలేదు.
మరికొద్దిరోజులైతే నిధులు లాప్స్ అయ్యే ప్రమాదముండగా, ఇప్పటికైనా ఎమ్మెల్యే సత్యం స్పందించి పనుల ప్రారంభానికి చొరవ చూపాలని గుడిపేట గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మల్యాల పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, కరీంనగర్‌కు చెందిన మాధవ కన్స్ట్రక్షన్ సంస్థ పనులు దక్కించుకున్నదని, గతేడాది మే 8న వర్క్ అగ్రిమెంట్ చేసుకొని, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. అగ్రిమెంట్ గడువు వచ్చే మే 7న ముగుస్తున్నందున పనులు పూర్తిచేయాలని రెండు సార్లు నోటీసులు ఇచ్చామని, పరిస్థితి ఇలాగే ఉంటే ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.