Gaddar | మెదక్: గద్దర్ చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల (Vennela) అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశంలో శుక్రవారం ఆమె గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పరితపించిన గద్దర్ తన పాటల ద్వారా దోపిడీ వ్యవస్థను ప్రశ్నించారని అన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీవితాంతం పీడిత ప్రజలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు గద్దర్ అని పేర్కొన్నారు.
ఆట, పాటల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప ప్రజాకవిగా గద్దర్ చరిత్రలో నిలిచిపోయారని వెల్లడించారు. గద్దర్ జన్మించిన మెదక్ జిల్లాకు ఆయన పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. గద్దర్ ఆశయాలను భావితరాలు కొనసాగించాలని, ఆయన చూపిన సామాజిక న్యాయం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.
మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల మైసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండారు గంగాధర్, సీనియర్ జర్నలిస్టు బొందుగుల నాగరాజు మాట్లాడుతూ ట్యాంక్‌బండ్ (Tankbund)పై కూడా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడిన మెదక్ ప్రెస్ క్లబ్ (Pressclub) అధ్యక్షుడు నర్సింహాచారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌లను డాక్టర్ గుమ్మడి వెన్నెల సన్మానించారు.
కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఆకుల పెంటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు గంట సంపత్, జుబేర్, కాంగ్రెస్ నాయకుడు మహేందర్‌రెడ్డి, మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు శంకర్ దయాళ్చారి, రిటైర్డ్ ఉపాధ్యాయులు రాధాకిషన్, మనోహర్, ఇసాక్, రవిశంకర్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు అప్పాజీపల్లి సురేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు అస్తరగల్ల బాల్‌రాజు, గజ్జల ప్రేమ్‌కుమార్, దాసు పాల్గొన్నారు.