Coffee | కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే పానీయాల్లో ఒకటి. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు లేదా పనిలో ఏకాగ్రత తగ్గినప్పుడు చాలా మంది వెంటనే ఒక కప్పు కాఫీ తాగుతారు. కాఫీ తాగిన కొద్దిసేపటికే శరీరంలో ఉత్సాహం పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే నిజంగా కాఫీ శరీరానికి శక్తిని ఇస్తుందా? లేక అది కేవలం కొంతసేపు మాత్రమే చురుకుదనాన్ని కలిగిస్తుందా? దీనిపై నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మందికి అలసట, నిద్రమత్తు వస్తుంది. అలాంటి సమయంలో ఒక కప్పు కాఫీ తాగితే వెంటనే మళ్లీ చురుకుగా అనిపిస్తుంది. దీంతో కాఫీ శరీరానికి శక్తిని అందిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి కాఫీ శరీరంలో శక్తి (కేలరీల)ని పెంచదు. అది కేవలం మెదడుపై పనిచేసి కొంతసేపు మెళకువగా, చురుకుగా ఉండేలా చేస్తుంది.
కాఫీలో ఉండే ప్రధాన పదార్థం కెఫీన్. ఇది మెదడు పనితీరును ఉత్తేజపరిచే సహజ ఉద్దీపన పదార్థం. కెఫీన్ మెదడులోని అడెనోసిన్ రిసెప్టర్లపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా అడెనోసిన్ అనే రసాయనం శరీరానికి విశ్రాంతి, నిద్రమత్తును కలిగిస్తుంది. కెఫీన్ ఈ ప్రభావాన్ని తాత్కాలికంగా అడ్డుకోవడంతో అలసట తగ్గినట్లు అనిపించి, అప్రమత్తత పెరుగుతుంది. అందుకే కాఫీ తాగిన వెంటనే ఉత్సాహంగా ఉన్న భావన కలుగుతుంది. అయితే ఈ ప్రభావాన్ని శరీరానికి నిజమైన శక్తి లభించిందని భావించకూడదు. పోషకాహార పరంగా శక్తి అంటే కేలరీలు. కానీ బ్లాక్ కాఫీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి కాఫీ శరీరానికి అదనపు శక్తిని అందించదు. అది కేవలం మెదడును కొంతసేపు ఉత్తేజపరచి అలసటను తగ్గించినట్లు అనిపించేలా చేస్తుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కెఫీన్ ప్రభావంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో అల్జీమర్స్, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది కొంతవరకు ఉపయోగపడుతుందని సూచించారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.
కాఫీ వల్ల వచ్చే చురుకుదనం ఎక్కువసేపు ఉండదు. కొంత సమయం తర్వాత కెఫీన్ ప్రభావం తగ్గిపోతుంది. దీంతో మళ్లీ అలసటగా అనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల కాఫీని శక్తికి ప్రత్యామ్నాయంగా భావించడం సరైంది కాదు. అలాగే కాఫీని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ కాఫీ తాగడం వల్ల శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్) ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవారు కాఫీని పరిమితంగా తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే వారు, ముఖ్యంగా ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), తరచూ విరేచనాల సమస్య ఉన్నవారు కూడా కాఫీని ఎక్కువగా తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంటుంది. కాఫీ తాగిన వెంటనే శరీరంలో శక్తి పెరిగినట్లు అనిపించినా, అది నిజమైన శక్తి కాదు. కెఫీన్ వల్ల మెదడు కొంతసేపు అప్రమత్తంగా మారడం వల్ల కలిగే తాత్కాలిక ప్రభావమే. కాబట్టి కాఫీని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అతిగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.