స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి! చాలా సినిమాల్లో ఇంటర్వెల్‌కు ముందు సీన్ ఒకరకంగా ఉంటే, చివరకు ైక్లెమాక్స్ మరో రకంగా ఉంటుంది. రాజకీయాలు కూడా అంతే! ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఏ నాయకుడి తలరాతలు ఎలా మారుతాయో ఊహించడం కష్టం. తెలుగు నేలపై గత నలభై ఏండ్ల రాజకీయాలను అవలోకనం చేసుకుంటే, ఇదే అభిప్రాయం కలుగుతున్నది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ల్యాండ్ మార్క్‌గా భావించే 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన అధికార పార్టీలు ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకోలేకపోయాయి. ఇందుకు ఒకట్రెండు మినహాయింపులు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 1989 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ అప్రతిహత విజయాలు సాధించిన ఎన్టీఆర్‌కూ ఓటములు తప్పలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలు సాధించినా అసెంబ్లీ ఎన్నికల నాటికి పరాజయం ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాటుకున్నది. కానీ, 1983 జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ చేతిలో మట్టికరిచింది. ఆ తర్వాత 1984 పార్లమెంట్ ఎన్నికలు, 1985 అసెంబ్లీ మధ్యంతర ఎన్నికలు, 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన ఎన్టీఆర్.. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ చేతిలో ఎదురుదెబ్బ తిన్నారు. ఏడేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 1991లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం నిలబెట్టుకున్నది. కానీ, మరో మూడేండ్ల తర్వాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ చేతిలోనే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఆ తర్వాత చంద్రబాబునాయుడు తన మామ ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి కూలదోసి గద్దెనెక్కడం, కొన్నాళ్లకే ఎన్టీఆర్ హఠాన్మరణం వంటి పరిణామాలు జరిగాయి.
1994-1999 మధ్యలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు కొనసాగాయి. దీంతో 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో రెండు సార్లూ 22 ఎంపీ సీట్లు గెలుచుకుని అధికార టీడీపీ కంటే కాస్త మెరుగ్గా ఉన్నట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీ.. 1999 అసెబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అందుకోలేకపోయింది! టీడీపీ 179 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే 2001లో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి, ఉద్యమబావుటా ఎగురవేశారు. అదే సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలోని 14,129 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే.. అందులో టీడీపీ 7,227, కాంగ్రెస్ 4,696, తెలంగాణలో టీఆర్ఎస్ 1,043 స్థానా లు గెలుచుకున్నాయి. అధికార టీడీపీ సగానికిపైగా పంచాయతీలు కైవసం చేసుకున్నది. అయినప్పటికీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం నిలబెట్టుకోలేకపోయారు! వామపక్షాలు, టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌కు 185 స్థానాలు దక్కడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 96కి 90 మున్సిపాల్టీలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయి బలాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 294 అసెంబ్లీ స్థానాలకుగాను 156 చోట్ల మాత్రమే విజయం సాధించి, 8 సీట్ల తేడాతోనే అధికారాన్ని నిలుపుకోగలిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి స్థానిక సంస్థల ఎన్నికలు 2014లో జరిగాయి. పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ గట్టి పోటీదారులుగా ముందుకొచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించాయి. 2018-19లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ అధికారం నిలుపుకోగా, ఏపీలో చంద్రబాబు నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘన విజయాలు సాధించినప్పటికీ, 2023-24 అసెంబ్లీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి.
గత నలభై ఏండ్ల ఎన్నికల ట్రాక్ రికార్డులను పరిశీలిస్తే, రెండు మూడేండ్లకోసారి ప్రజల ‘మూడ్’ మారుతున్నదనే అభిప్రాయం కలుగుతున్నది. ఏ ఒక్క నాయకుడి పట్ల కూడా ప్రజల ‘మూడ్’ ఎప్పుడూ ఒకేరకంగా ఉండటం లేదని, ఒకసారి ఆగ్రహించినా మరోసారి అనుగ్రహిస్తున్నారని స్పష్టమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలను చూసి తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి సంకేతమని, తమ పాలన ప్రజలను ఆకట్టుకుంటున్నదని, తాము ప్రజలను కణికట్టు చేయగలమని అధికార పార్టీలు భావిస్తుంటాయి. అది సహజం కూడా! అయితే, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీలు ఎందుకు బోల్తా కొడుతున్నాయనేది ఆసక్తికర విషయం.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఉండే ఓటర్ల సంఖ్యకు, అంతకు రెండు మూడేండ్ల ముందు జరిగిన అసెంబ్లీ ఓటర్ల సంఖ్యకు పెద్దగా తేడా ఉండదు. అంతేకాకుండా, కొత్త ప్రభుత్వాల పట్ల ప్రజలు కొంతకాలంపాటు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తారు. అందుకే కాబోలు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అంతకుముందు నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే దాదాపు ప్రతిబింబిస్తుంటాయి. అయితే, సినిమాల్లో ఇంటర్వెల్ తర్వాత కొత్త పాత్రలు, ఫ్లాష్‌బ్యాక్‌లు ప్రత్యక్షమైనట్టే, మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి లక్షల సంఖ్యలో ‘కొత్త ఓటర్లు’ తెర మీదకు వస్తారు. వాళ్లే తొలిసారిగా ఓటు వేయబోతున్న విద్యార్థి ఓటర్లు!
రాష్ట్రంలో ప్రస్తుతం 16, 17 ఏండ్ల వయస్సు ఉన్న దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, మెడికల్, సాధారణ డిగ్రీలు, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో దాదాపు ఐదారు లక్షల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ 15 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందబోతున్నారు. రానున్న రెండు మూడేండ్లలో మరో ఐదారు లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ‘ఉద్యోగ వేట’కు బయలుదేరబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరు ఏ పార్టీ వైపు మొగ్గి తే, ఆ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్, నేదురమల్లి జనార్దన్‌రెడ్డి, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల హయాంలో విద్యార్థి, యువజనుల భాగస్వామ్యంతో చెలరేగిన ఉద్యమాలు చివరకు ఆయా ప్రభుత్వాల పతనానికి దారితీశాయి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్ర ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది. అయితే, అప్పటితరం విద్యార్థులను ప్రగతిశీల, అభ్యుదయ, వామపక్ష భావజాలం ఎక్కువగా ప్రభావితం చేస్తే, ఇప్పటి తరాన్ని కెరీరిజం, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు, వీరిని ఆకర్షించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు మత విద్వేష రాజకీయాలతో గాలం వేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు దోహదపడ్డాయనే విశ్లేషణలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ రెండు పథకాలను ఎలాంటి భేషజాలకు పోకుండా కొనసాగించి, మరింత విస్తృతం చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మేరకు ప్రయోజనం పొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను కొనసాగిస్తున్నప్పటికీ నిధులు విడుదల చేయడం లేదు. ముఖ్యంగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, కాలేజీలు నడుపలేమంటూ యాజమాన్యాలు సమ్మెలకు దిగుతున్న పరిస్థితి నెలకొన్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజీ యాజమాన్యాలకూ, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు; దాదాపు 12.5 లక్షల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఓట్ల లెక్కల్లో చెప్పాలంటే, 12.5 లక్షల మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులతో కలిపి దాదాపు 30 లక్షల నుంచి 35 లక్షల ఓటర్లకు సంబంధించిన వ్యవహారం. ఇదేమీ చిన్న సంఖ్య కాదు!
ఇటీవల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి కాంగ్రెస్ సాధించిన మొత్తం ఓట్లు దాదాపు 15 లక్షలు! బీఆర్ఎస్ సాధించిన ఓట్లు 10 లక్షల 87 వేలు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న తేడా 4 లక్షల 17 వేలు. బీజేపీకి వచ్చిన ఓట్లు ఆరు లక్షలు మాత్రమే! కానీ, రాష్ట్రవ్యాప్తంగా అంతకుమించిన సంఖ్యలో ఫీజురీయింబర్స్‌మెంట్ అనే ఒకే ఒక్క అంశం వల్ల ప్రభావితమయ్యే విద్యార్థి ఓటర్లు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొత్తం ఫీజు చెల్లించిన విద్యార్థులకే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో టాప్ ప్రయారిటీ ఇస్తామని, టీసీలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థుల మీద యాజమాన్యలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే కాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహావేశాలు ఏరూపం తీసుకుంటాయో ఊహించడం కష్టమేమీ కాదు! నేటి విద్యార్థులను తమ వైపు తిప్పుకోగలిగేవారిదే రేపటి భవిష్యత్! గత 40 ఏండ్ల ఎన్నికల ఫలితాల సారాంశం ఇదే. లోకల్‌వార్ జస్ట్ ఇంటర్వెల్! ైక్లెమాక్స్ షాట్ స్టూడెంట్స్దే! అన్న విషయాన్ని ఏ రాజకీయ పార్టీ మరువకూడదు.