New CDS : భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా జనరల్ రాజా సుబ్రమణి (General Raja Subramani) బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ (ఆదివారం) భారత మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ (General Anil Chauhan) ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దాంతో మిలిటరీ థియేటరైజేషన్ బాధ్యతలను ఇక నుంచి సుబ్రమణి పర్యవేక్షించనున్నారు. వీటి ద్వారానే భారత త్రివిధ దళాల్లో సమన్వయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జనరల్ రాజా సుబ్రమణికి చైనా, పాకిస్థాన్ అంశాల్లో నైపుణ్యం కలిగిన వాడిగా సైనిక వర్గాల్లో పేరున్నది.
ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్‌కు మిలిటరీ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్గానూ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతల్లో ఆయన ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్స్ ఏర్పాటుతో థియేటరైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం శనివారంతో ముగిసింది.
నూతన సీడీఎస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనరల్ రాజా సుబ్రమణి మీడియాతో మాట్లాడారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి సైనిక దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని చెప్పారు. దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు.