Rana | టాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా.. ఇటీవల చాలా సన్నగా కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బాహుబలి’ సిరీస్‌లో భళ్లాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తన శరీరాకృతితో కూడా ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
కొంతమంది నెటిజన్లు రానాకు మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయా, ఎందుకింత సన్నగా మారిపోయారు? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అభిమానులు కూడా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రానా లుక్ వెనుక ఆరోగ్య సమస్యలు కాకుండా ‘జై హనుమాన్’ సినిమా కోసం చేసిన ప్రత్యేక మేకోవర్ కారణమని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో రానా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడి శాపం కారణంగా యుగాల తరబడి భూమిపై సంచరిస్తున్న అశ్వద్ధామ పాత్రకు తగ్గట్టుగా ఆయన తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారని సమాచారం.
అశ్వద్ధామ పాత్రలో వాస్తవికత కనిపించేలా రానా తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన బరువు తగ్గి ఈ ప్రత్యేక లుక్‌లో కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే రానా కూడా తన కొత్త లుక్‌పై స్పందించలేదు. కాగా, 2024 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పురాణ గాథలను ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రానా లుక్ గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ లుక్ నిజంగా ‘జై హనుమాన్’ సినిమాలోని అశ్వద్ధామ పాత్ర కోసమేనా? అనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.