న్యూఢిల్లీ: పీఎఫ్ విత్‌డ్రాయల్స్ ప్రక్రియ ఇక వేగవంతం కానున్నది. కొత్త పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులలో అత్యధికం అదే రోజున లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోనే పరిష్కారం అవుతాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆశిస్తోంది. ఈ చర్య వేతన జీవులకు గొప్ప ఉపశమనాన్ని కలిగించనున్నది. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రపంచ పారిశ్రామిక సంబంధాల సదస్సులో ప్రసంగించిన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(సీపీఎఫ్సీ) రమేశ్ కృష్ణమూర్తి ఈ మేరకు ప్రకటించారు.
పెండింగ్‌లో ఉన్న పాత క్లెయిమ్లన్నిటినీ ఈపీఎఫ్ఓ పరిష్కరించిందని కూడా ఆయన చెప్పారు. క్లెయిమ్ పరిష్కారాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ మేము దాదాపుగా పూర్తి చేశాము. కొత్త విధానంలో 90 శాతం వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పరిష్కారం అవుతున్నాయి. సభ్యులు సమర్పించే క్లెయిమ్‌లలో అత్యధిక భాగం అదే రోజున లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోపు పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తున్నాము అని ఆయన తెలిపారు.