రుద్రంపూర్, సెప్టెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్–నషా ముక్త్ భారత్ యువ భారత్ అభియాన్’ లో భాగంగా సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం నాగయ్యగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) వైద్యులు డాక్టర్ బి.శ్యామ్ ప్రసాద్, డాక్టర్ ఎన్.స్రవంతి విద్యార్థులకు నషా ముక్త్ భారత్ యువ భారత్ అభియాన్ ఉద్దేశాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చిన్ననాటి నుంచే మంచి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు.
ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, బయట లభించే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భారత్ కుమార్, ద్రౌపతి , రామవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి. శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు కె.కవిత, బి.తార, పి.జ్యోతి, ఫార్మసిస్ట్ ఎం.రేణుక, ఆశ కార్యకర్త భవాని, ఆర్బీఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.

నషా ముక్త్ భారత్‌పై విద్యార్థులకు అవగాహన