Ram Charan | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. తన రాబోయే చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ కోసం శనివారం చైన్నై వెళ్లిన రామ్ చరణ్ అక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎంగా విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఇక విజయ్ సినీ రంగాన్ని వదిలి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడంపై చరణ్ స్పందిస్తూ.. కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడే తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి ప్రజా సేవకు అంకితం కావడం గొప్ప విషయమని కొనియాడారు. చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా విజయ్ సాధించిన ఈ విజయం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు, విజయ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నానని వేదికపై పేర్కొన్నారు. అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కూడా రామ్ చరణ్ స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన విజయ్ గారికి అభినందనలని, ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఈ విజయానికి కారణమని, ఆయన నాయకత్వంలో తమిళనాడు మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఇదే వేదికపై రామ్ చరణ్ తన కొత్త చిత్రం ‘పెద్ది’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమాజంలో గుర్తింపు లేని, తమ వాయిస్ వినిపించలేని సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక అద్భుతమైన పాత్రను ఈ సినిమాలో పోషించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. తన సినీ కెరీర్లోనే అత్యంత కష్టమైన పాత్ర ఇదని, ఈ సినిమా ప్రయాణంలో నటుడిగా ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాగా, ఈ చిత్రంలోని ఒక రెజ్లింగ్ సీక్వెన్స్ చిత్రీకరణకు మూడు నాలుగు రోజుల ముందు తన మణికట్టుకు చిన్న గాయమైందని, అయినప్పటికీ 20 రోజుల పాటు షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆ గాయం పెద్దదైందని చరణ్ వెల్లడించారు. ఎలాగైనా సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతోనే షూటింగ్ పూర్తి చేశానని తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంతో ఉత్కంఠ భరితంగా రూపొందిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.