Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదట ‘రామాయణ’ ట్రైలర్‌ను జులై 24, 2026న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ ప్లాన్ వాయిదా పడింది. దీంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి మరింత పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, ట్రైలర్ విడుదలపై మేకర్స్ కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, జులై 29, 2026న ‘రామాయణ’ ట్రైలర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసే అవకాశాలను మేకర్స్ పరిశీలిస్తున్నారట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అవుతూ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ‘రామాయణ’ చిత్రానికి ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో జులై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘Spider-Man: Brand New Day’ సినిమాతో పాటు థియేటర్లలో ‘రామాయణ’ ట్రైలర్‌ను ప్రదర్శించే అవకాశముందని బలమైన ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యూహం అమలైతే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘రామాయణ’కు భారీ ప్రచారం లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ నటీనటులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పురాణ గాథను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాల విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా, నటుడు యష్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగానే జులై 29న డిజిటల్ ట్రైలర్ విడుదలై, మరుసటి రోజు ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’తో థియేటర్లలో ప్రదర్శితమైతే.. ‘రామాయణ’ ప్రమోషన్స్‌కు అది మరో భారీ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.