Ghooskhor Pandat | తమ రాబోయే నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ఘూస్ఖోర్ పండిట్’ (Ghooskhor Pandat) చుట్టూ ముసురుకున్న వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టైటిల్ కారణంగా తమపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని, బెదిరింపులు వచ్చాయని, చివరికి ఈ వివాదంలోకి తన కుటుంబాన్ని కూడా లాగి అసభ్య పదజాలంతో దూషించారని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదం తలెత్తిన రెండు రోజుల్లోనే తాము క్షమాపణలు చెప్పామని, ఒక సినిమా తీస్తున్నప్పుడు అందులో ఎవరినైనా తీవ్రంగా బాధించే అంశాలు ఉంటే మార్చుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని స్పష్టం చేశారు. అయితే కేవలం టైటిల్ మార్చడం తమకు పెద్ద సమస్య కాదని, తాము ఒకదానికి బదులు పది విభిన్నమైన, ఆసక్తికరమైన శీర్షికలను ఆలోచించగలమని అన్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రజలు కనీసం సినిమా కథ ఏంటో కూడా తెలుసుకోకుండా, చాలా అసహనంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ అభిప్రాయాలను రుద్దుతున్నారని, అలాంటి వారితో వాదించి బురదలో దిగడం తనకు ఇష్టం లేదని మనోజ్ బాజ్పాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక ఈ సినిమాకు రితేష్ షా దర్శకత్వం వహిస్తుండగా.. నీరజ్ పాండే, రితేష్ షా కలిసి కథను అందించారు. చిత్రంలో మనోజ్ బాజ్పాయ్తో పాటు నుస్రత్ భరూచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్య దత్తా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైనప్పుడు టైటిల్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో నెట్ఫ్లిక్స్ దానిని తొలగించింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తరఫున కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ.. ఆ వివాదాస్పద టైటిల్ను ఉపసంహరించుకున్నామని, సినిమాకు కొత్త పేరు పెడతామని న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉందని, సినిమాలో ఎవరినీ విమర్శించే ఉద్దేశం లేదని, కేవలం ఒక నిక్ నేమ్ లాగా మాత్రమే ఆ పదాన్ని వాడామని రచయిత నీరజ్ పాండే వివరణ ఇచ్చారు. కొత్త టైటిల్ మరియు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. కాగా, మనోజ్ బాజ్పాయ్ నటిస్తున్న మరొక చిత్రం ‘గవర్నర్: ది సైలెంట్ సేవియర్’ జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.