జడ్చర్ల టౌన్, మార్చి 3 : జ డ్చర్ల ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వ చ్చిన శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో మ ంగళవారం పాత ఏ రియా దవాఖాన మార్చురీని లక్ష్మారెడ్డి దవాఖానను, వంద పడకల వైద్యశాల వద్ద మార్చురీ భవనాన్ని పరిశీలించారు. విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను ఆయన కలిసి ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో సరైన వసతులు, పరికరాలు లేకపోవటంతోనే ఈ ఘటన జరిగిందని కమిషనర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల దవాఖానలో జరిగిన ఘటన చాలా దారుణమన్నారు. ఓ వ్యక్తి చనిపోతే శవాన్ని ప్రభుత్వ మార్చురీలో పెడితే కుక్కలు పీక్కుతిన్న ఘటన చరిత్రలో చూడలేదన్నారు. మార్చురీలో ఫ్రీజర్లు లేవు.. స్ట్రెచర్ మీద శవాన్ని పెట్టలేదు.. నేలపై ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. పేదలపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
దవాఖానల్లో మందులు సరిగా లేవని, వైద్య పరికరాలు, వసతులు లేవని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో బ్రహ్మాండగా సర్కారు దవాఖానలను అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించామని గుర్తు చేశారు. దీంతో నాడు ప్రసవాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు పాతరోజులు తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్లీ పేదలకు వైద్య సేవలు అందకుండా దవాఖానలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దవాఖానల్లో ప్రభుత్వం సరైన వసతులు కల్పిస్తే వాటిని అధికారులు వాడుకోకపోతే నిర్లక్ష్యమని.. కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండానే ఈ ఘటన అధికారుల మీద తోసేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. కొత్త భవనంలోకి మార్చురీని ఎందుకు మార్చలేదు..? పాత మార్చురీలో ఫ్రీజర్, స్ట్రెచర్ ఎక్కడికి పోయాయి? అని నిలదీశారు. దవాఖానలను నిర్లక్ష్యంగా వదిలేయటం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
దవాఖానల్లో వసతులు కల్పించకుండా కేవలం అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పడం సరికాదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. దవాఖానల నిర్వహణపై నిర్లక్ష్యం చేసిన మంత్రులు, నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఇక్కడికొచ్చి సర్కారు దవాఖానలో జనరేటర్ లేదన్నాడు.. ఇప్పుడు పాత దవాఖాన మార్చురీలో ఫ్రీజర్లు, స్ట్రెచర్లు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ మాయమైపోతున్నాయని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ఇంతటి దుస్థితి చోటు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. రేవంత్ సర్కారు పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజాపాలన అంటూ ప్రజలను తొక్కిపెట్టి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వంద రోజులు వంద పడకల దవాఖానలో అన్ని వసతులు, స్టాఫ్ తెస్తానని చెప్పిన స్థానిక నాయకులు ఎక్కడికి పోయారని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే స్టాఫ్‌ను నియమించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే కొత్త మార్చురీ భవనం ప్రారంభించాలని, పాత, బస్తీ దవాఖానలో, హోమియోపతి సేవలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
నాగసాలలోని మృతుడు భీమేశ్ కుటుంబాన్ని మంగళవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట జెడ్పీ వైస్ మాజీ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు మురళి, ప్రణీల్‌చందర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు.