చెన్నై: ప్రతి భారతీయుడినీ సమానంగా చూసే ప్రధానిని దక్షిణాది అందిస్తుందని తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున అన్నారు. భవిష్యత్తులో దక్షిణాది నుంచే ఒక ప్రధానమంత్రి రావాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి చెందిన ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున ఒక టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. (Aadhav Arjuna) భవిష్యత్తులో దక్షిణాది నుంచే ఒక ప్రధానమంత్రి రావాలనే తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ‘నేను ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా. దక్షిణాది నుంచే ఒక ప్రధానమంత్రి రావాలి, కచ్చితంగా వస్తారు. బహుశా ఇప్పుడు కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఆయన వస్తారు. ఆ ప్రధాని ప్రతి భారతీయుడికి ప్రాతినిధ్యం వహిస్తారు, ప్రతి భారతీయుడిని సమానంగా చూస్తారు’ అని అన్నారు.
కాగా, తమిళనాడు రాజకీయ పరిస్థితుల గురించి కూడా మంత్రి అర్జున ప్రస్తావించారు. సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేకత, మెరుగైన పాలన కోసం డిమాండ్ వంటి అంశాల ఆధారంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తోందని తెలిపారు. ‘ఇది కేవలం ప్రభుత్వం మారడం మాత్రమే కాదు. ప్రతి తమిళుడి హృదయంలోనూ సామాజిక న్యాయం పట్ల ఆశయాలు ఇంకా నిలిచే ఉన్నాయి’ అని అన్నారు.
మరోవైపు తమిళనాడులో టీవీకే విజయాన్ని తాను గమనిస్తున్న ఒక విప్లవ రాజకీయ మార్పుగా మంత్రి అర్జున అభివర్ణించారు. సమానత్వానికి సంబంధించిన ద్రావిడ సూత్రంతో దానిని ముడిపెట్టారు. ‘ఇదొక విప్లవం. ద్రావిడం అంటే సమానత్వం’ అని ఆయన అన్నారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సైద్ధాంతిక సంఘర్షణ లేదని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రధాన అంశం సిద్ధాంతం కాదని, అవినీతేనని ఆయన అన్నారు.
అయితే మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిల మరణాల తర్వాత తమిళనాడులో నాయకత్వ శూన్యత ఏర్పడిందని మంత్రి అర్జున తెలిపారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఒక లీడర్‌గా కాకుండా కేవలం నిర్వాహకుడిగా అభివర్ణించారు. ‘స్టాలిన్ ఒక నిర్వాహకుడు, నాయకుడు కాదు. ఈపీఎస్ ఒక విఫల నిర్వాహకుడు’ అని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే రెండూ ఒకే సిద్ధాంతాన్ని పంచుకుంటాయని మంత్రి అర్జున ఆరోపించారు. అయితే రాష్ట్రాన్ని పరిపాలించే విధానంలోనే ఆ రెండు పార్టీల్లో కీలకమైన తేడా ఉందన్నారు. ‘డీఎంకే, ఏఐఏడీఎంకే రెండింటికీ ఒకే సిద్ధాంతం ఉన్నది. పరిపాలనలోనే ఏకైక తేడా’ అని ఆయన విమర్శించారు.