Actor Nani | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘ది ప్యారడైజ్’ రివ్యూలు బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న కోర్టు ఉత్తర్వుల వివాదంపై నాని స్పందించారు. ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ.. బెంగళూరు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేవలం ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్న ఫేక్ పోస్టులను కట్టడి చేయడానికి మాత్రమేనని, నిజమైన ప్రేక్షకుల రివ్యూలు, స్పందనలు లేదా విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి కొందరు కావాలనే కావాలని ఫేక్ కామెంట్లు, డెఫమేటరీ పోస్టులు సృష్టిస్తున్నారని, దీనిపై నిర్మాతలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి కోర్టును ఆశ్రయించగా సెప్టెంబర్ 19న బెంగళూరు సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐని ఉపయోగించి కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన ప్రేక్షకులు సినిమా చూసి తమ అభిప్రాయాన్ని, విమర్శలను స్వేచ్ఛగా తెలపవచ్చని, కోర్టు ఆర్డర్ దానికి ఎప్పుడూ అడ్డురాదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ వివాదం వెనుక డబ్బులిచ్చి మరీ ఏఐ బాట్లను కొనుగోలు చేసి ఫేక్ ప్రచారం చేయిస్తున్న వ్యక్తులు మాత్రమే టార్గెట్ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సినిమా సెప్టెంబర్ 23 రాత్రే పలు నగరాల్లో ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించబడుతుండగా, అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.