Lok Sabha Elections | సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్‌జోషిలు ఎప్పటికప్పుడు ఎన్నికల సరిళిని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్(అసెంబ్లీ ఉప ఎన్నిక), మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరిలతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మెదక్ పార్లమెంట్ స్థానాలు కొన్ని పోలింగ్ బూత్‌లు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోకి వస్తాయి.
ఈ నేపథ్యంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఉదయం నుంచి క్షేత్ర స్థాయిలో శాంతి భద్రతల పరిస్థితులు ఏమిటనే విషయంపై నిరంతర పర్యవేక్షణ చేశారు. చిలకలగూడలోని పోలింగ్ బూత్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్ల పరిధిలో పలు పోలింగ్ కేంద్రాలను రాచకొండ సీపీ తరుణ్‌జోషి, సైబరాబాద్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను అవినాష్ మహంతి సందర్శించారు.
పోలింగ్ బూత్‌ల వద్ద నిషేధాజ్ఞలు విధిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి 144 సెక్షన్ అమలులో ఉన్నాయి. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సాఫీగా పోలింగ్ జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇలా ఓల్డ్‌సిటీలో ఒకటి రెండు చెదురు మదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రై పోలీస్ కమిషనర్లు సిబ్బందికి పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 25వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ఎన్నికల వేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి పోలీస్ కమిషనర్లు సిబ్బందిని ఎన్నికల విధులకు సిద్ధం చేశారు.
ఒక పక్క రంజాన్, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలు ఈ మధ్యకాలంలోనే వచ్చినా ఆయా పండుగలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పూర్తి పట్టణ ప్రాంతం కావడం, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి కొన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా వస్తుండడంతో అందుకు తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లను ఆయా కమిషనరేట్ పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని ఆయా పోలీస్ కమిషనర్లు అమలు చేసి సక్సెస్ సాధించారు.