Gaddar Awards 2025 | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ – 2025’ లో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారురుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. బాపూజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యూనిటీ’ (ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) అనే డాక్యుమెంటరీ గద్దర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
దర్శకుడు బడుగు విజయ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రాన్ని చిరందాస్ శ్రీకాంత్ నిర్మించగా, బాపూజీ బాల్యం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఆయన సాగించిన అలుపెరగని పోరాటాన్ని ఇందులో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను తమ నటనతో బాపూజీ పాత్రకు ప్రాణం పోశారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు స్వరాష్ట్రంలో గద్దర్ పేరిట ఇచ్చే తొలి అవార్డుల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ డాక్యుమెంటరీ గతంలో ముంబైలో జరిగిన ‘భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023’లో కూడా ‘బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్’ మరియు ‘ఐకానిక్ ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను గెలుచుకుంది.