Helicopter Blast : గ్రీస్ (Greece) లో ఘోరం జరిగింది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు (Fire Fighting Helicopters) గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు (Two pilots) ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఏథెన్స్ (West Athens) లోని పసాతా తీర ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
అటికా-బొయోటియా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు ‘బెల్’ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపుచేసే క్రమంలో ఈ రెండు హెలికాప్టర్లు అత్యంత సమీపంలోకి రావడంతో వాటి రోటార్లు (రెక్కలు) ఒకదానికొకటి బలంగా తాకాయి. దాంతో ఒక హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయి నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు పైలట్లను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారని గ్రీస్ ఫైర్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వాసిలిస్ వత్రాకోగియానిస్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనపై గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
WATCH: 2 firefighting helicopters crash while battling blaze in Psatha, Greece pic.twitter.com/kxvyo9ueQQ
— Rapid Report (@RapidReport2025) August 2, 2026