సాహిత్యానికి ప్రచురణే ప్రాచుర్యాన్ని తెస్తుంది. పుష్ప సుగంధ పరిమళాల వ్యాప్తికి గాలి తోడైనట్టు అక్షరాలను కాగితాలు మోసుకెళ్తాయి. గాలి పాత్ర పోషించే సాహిత్యాభిలాషుల కృషి ప్రముఖమైనది. వారి శ్రమ వల్ల తెలుగులో ఎన్నో రచనలు సంకలనాలై సాహిత్య చరిత్ర మేడకు ఇటుకలు పేర్చాయి. సంకలనాల రూపకల్పనలో కర్తల తాహతు మేరకు ఫలితాలున్నా ప్రతి పుస్తకం తనదైన పాత్ర పోషిస్తుంది. పుస్తకంలో ఉన్న మేలిమి సమాచారం, దాని క్రోడీకరణలో చూపించిన ప్రజ్ఞ, విద్వత్తు ఆధారంగా సాహిత్యంలో స్థానం నిర్ణ్ణీతమవుతుంది.
దశాబ్దాల సాహిత్యాభిలాష, పఠనం వల్ల చదువరులు కూ డా మేధోపరంగా సాహితీవేత్తగా మారిపోతారు. వారిలోనూ ఒక తపన మొదలవుతుంది. కొందరు విశ్లేషకులుగా మారుతారు, కొందరు ఇష్ట రచనల సంకలన కృషికి నడుం కడతారు. ఇలా ఇతరుల రచనలను పల్లకిలో మోయడమనేది నిజంగా సర్వోత్తమ సేవగా భావించాలి. ఈ రెండు పాత్రలూ సాహిత్య వృద్ధికి, విస్తరణకు కొత్త బాటలు వేస్తాయి. రచయితల సొంత పుస్తకాలే ఎక్కువగా వస్తున్న ఈ కాలంలో ‘కవన గర్బరాలు’ అనే భారీ కవిత్వ సంకలనం వచ్చింది. వెయ్యికిపైగా పేజీలున్న క్రౌన్ సైజు పుస్తకం చూడగానే తెలుగు కవితకు గజమాల గౌరవంగా అనిపిస్తుంది. గర్బరాలు అనే పదం ఒక ప్రయోగం. అది ఒక పూల మొక్క పేరు.
గడ్డి జాతికి చెందిన దాన్ని రంగురంగుల్లో పూలు పూసేలా అభివృద్ధి పరిచిన జర్మన్ శాస్త్రవేత త్రాగట్ గర్బర్ పేరును దానికి పెట్టారు. ఆ పూల అందాలను ముఖచిత్రంపై చూడవచ్చు. సంకలనంలోని భిన్నకవుల, భిన్న భావాల రచనలకు ప్రతీకగా ఈ పదం వాడారు. ముఖచిత్రంపై ‘100 సంవత్సరాల సాహిత్య సంపద నుంచి ఏర్చి, కూర్చిన కవితలు, విశ్లేషణలు’ అని ఉంది. సంకలనకర్తలు చేపూరు సుబ్బారావు, వీకే ప్రేమ్‌చంద్. వీరిద్దరూ దాదాపు ఎనభై ఏండ్ల వయస్కులు కావడం గమనార్హం. చేపూరు సుబ్బారావు ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేశారు. కొన్ని అనువాదాలు చేశారు. వీకే ప్రేమ్‌చంద్ అమెరికాలో, భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేశారు.
ఈ సంకలనంలో కవుల వరుసను తెలుగు అక్షర క్రమంలో పేర్చారు. వంద మంది కవుల్లో మొదట అడవి బాపిరాజు పేరు రాగా చివరన సౌభాగ్య ఉన్నారు. ఈ విధమైన క్రమసూచిక వల్ల కాలానుగుణ కవిత్వ పరిణామాలు తెలిసే అవకాశం తగ్గిందనుకోవచ్చు. ఈ ప్రయత్నం తెలుగు తొలి కవులైన గురజాడ, మల్లాది, రాయప్రోలుతో మొదలై విశ్వనాథ, విద్వాన్ విశ్వం, జంధ్యాల, శ్రీశ్రీ, పుట్టపర్తి, కాళోజీ, బసవరాజు, సినారె, దాశరథిల మీదుగా కుందుర్తి, అజంతా, అద్దేపల్లి, శివారెడ్డిలను ప్రస్తావిస్తూ.. నేటితరం కవులతో వందకు చేరుకున్నది.
సంఖ్యాపరంగా చూస్తే వర్తమాన కవులకు ఎక్కువ చోటు లభించిందనవచ్చు. పేరొందిన కవులే కాకుండా, కవులుగా గుర్తింపు పొందనివారు కూడా ఇందులో ఉన్నారు. తక్కువ రాసినా అందులో మంచి కవితలున్నందున ఇలా ఎంపిక చేసి ఉంటారు. వంద మంది కవుల ప్రసిద్ధ, ఉత్తమ కవితలను ఎంచుకొని కవి పరిచయంతో పాటు ప్రతి కవితకు వివరణ ఇచ్చారు. ఆయా కవులపై, వారి రచనలపై సీనియర్ కవులు, సాహితీవేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను జత చేశారు. వీటి సేకరణలో చాలా శ్రమ కూడి ఉన్నది. ఈ సమాచారం కవిత్వంలో కొత్తవారికి, తెలుగు విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయోగపడుతుంది.
సంకలనంలో కర్తల ముద్ర ఉన్నా, భావకవిత్వానికి పెద్దపీట వేసినా వీరి ప్రయత్నం వందనీయం, అభినందనీయం. సాహితీ క్షేత్రంలో ఉండే సంపాదకుల లేమి సంకలన రూపకల్పనలో కనబడుతున్నా వీరి కృషి ముందు వాటిని మరిచిపోవచ్చు. ఎవరో ఒకరు ముందుకురాకపోతే ఇలాంటి బృహత్కార్యాలు సాహితీ సీమకు అందవు. ముదిమిలో ఇంతటి నిర్మాణ భారాన్ని ఎత్తుకున్న సంకలనకర్తలు అటు ప్రభుత్వానికి, ఇటు ఇతర సాహితీ సంస్థలకు ఆదర్శంగా నిలిచారు.
బి.నర్సన్
94401 28169