KTR | రాజన్న సిరిసిల్ల : పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. ఐదు నెలలు టైం పాస్‌గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా.. అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకుని మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నించిందని కేటీఆర్ మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది. ఆ రెండు పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్‌ను దూషించడానికి పరిమితం అయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వీరి వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే పరిస్థితి బాగుండదు. ఈ ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఐదు నెలల్లోనే అసాధారణ వ్యతిరేకత వచ్చింది. క్షేత్ర స్థాయిలో బాగాలేదు. అడ్డగోలు హామీలిచ్చి నెరవేర్చలేదనే కోపంతో ప్రజలు ఉన్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ది తెచ్చుకొని 420 హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు అని కేటీఆర్ హెచ్చరించారు.