కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారథిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. సమయానికి నగదు చేతిలో లేక అనేకమంది అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్‌కార్డులను కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిరాకరిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. హెల్త్‌కార్డుల ద్వారా నగదురహిత వైద్యం పొందే సదుపాయం లేకపోవడంతో ముందుగా నగదు చెల్లించి వైద్యసేవలు పొందాల్సి వస్తున్నది. మొదట సేవలందుకొని తర్వాత రీ యింబర్స్‌మెంట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా చెల్లించేందుకు డబ్బులు అందుబాటులో లేక నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. పైగా రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చయితే రీయింబర్స్మెంట్ కింద రూ. 2 లక్షలు మాత్రమే ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుండటం విచారకరం.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నది. రాష్ట్రంలో నగ దు రహిత వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ఉద్యో గ, ఉపాధ్యాయ ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఒకరిని తీసుకొని కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసి ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని ప్రతిపాదనలను రూపొందించారు. తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘాల ఆధ్వర్యంలో అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పం దించారు. అయితే సంబంధిత ఆదేశాలు జారీ అయ్యేలోపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో నగదు రహిత వైద్యం నిర్ణయం అటకెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి, అధికారులు వీలైనంత త్వరగా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, వారి పై ఆధారపడిన కుటుంబసభ్యులకు కూడా నగదు రహిత వైద్యం అందేలా ఆరోగ్య భద్రతకార్డులను మంజూరు చేయాలి.
– డాక్టర్ ఎస్. విజయభాస్కర్, 92908 26988