హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి ( Nandini Sidhareddy ) కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( Sahitya Akademi Award ) దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) హర్షం వ్యక్తం చేశారు. ఈ అత్యున్నత పురస్కారం లభించడం యావత్ తెలంగాణ( Telangana )రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి తన తరఫున , పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేసి, తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆయన కృషి మరువలేనిదన్నారు. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ, తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా ఆయనను అభివర్ణించారు.
సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సిధారెడ్డి గెలుచుకోవడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం సముచితమని అన్నారు.