LPG supply : దేశంలో ఎల్పీజీ గ్యాస్ (LPG Gas) కొరత ఏర్పడిందని, త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000 దాటుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రచారానికి తెరదించేందుకు కేంద్రం (Union Govt) కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీ స్టాక్ గృహావసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది.
అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కూడా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టంచేసింది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హార్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని వెల్లడించింది.
యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆగిపోయిన అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని తెలియజేసింది.