హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కో ర్టులు ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరో 2 రోజులపాటు పోలీస్ కస్టడీ అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించడంతోపాటు హత్యాయత్నం, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఎదురొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఇప్పటికే 2 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
ఆ సమయంలో ఉదయ్ కృష్ణారె డ్డి సరైన సమాధానాలు చెప్పలేదని నిందితుడిని మరోసారి కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోర్టును కోరారు. దీంతో పోలీసులు మంగళవారం నుంచి 2 రోజులపాటు ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించేందుకు అనుమతిచ్చిన కోర్టు.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్యలో మాత్రమే విచారించాలని స్పష్టం చేసింది.
న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ చేపట్టాలని, నిందితుడిని మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేయరాదని షరతులు విధించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి వీర్య పరీక్ష నిర్వహించేందుకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి అత్తాపూర్ స్టేషన్‌కు తరలించి విచారించనున్నారు.