-ఓ పాఠకురాలు
Thalassemia | మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బిడ్డకు తలసేమియా మేజర్ వ్యాధి ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది హిమోగ్లోబిన్‌కు సంబంధించిన, జన్యుపరమైన సమస్య. ఈ వ్యాధి తలసేమియా మైనర్, తలసీమియా మేజర్ అని రెండు రకాలుగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ కొద్ది శాతం తక్కువగా ఉంటే మైనర్ వ్యాధి అంటారు. లక్షణాలు అంత సులువుగా బయటపడకపోవడం వల్ల ఈ వ్యాధిని అంత త్వరగా గుర్తించడం సాధ్యపడదు. అదే ‘మేజర్’ వ్యాధి అయితే మాత్రం త్వరగా బయటపడుతుంది. హిమోగ్లోబిన్లో ఆల్ఫా, బీటా అనే రెండు రకాల ప్రొటీన్లు రెండు చొప్పున ఉంటాయి. వీటిని తయారు చేయడానికి అవసరమైన జన్యువులో పుట్టుకతో ఏదైనా మార్పు ఉన్నట్టయితే హిమోగ్లోబిన్ సరిగ్గా ఫామ్ అవ్వదు. ఈ కారణంగా రక ్తకణాలు త్వరగా విరిగిపోవడం, క్షీణించడం జరుగుతుంది. సాధారణంగా మూడు నెలల జీవిత కాలాన్ని కలిగి ఉండే రక్త కణాలు కొద్ది వారాల్లోనే క్షీణించిపోతాయి. ఇలా రక్తకణాలు ముందుగానే విచ్ఛిన్నమైతే శరీరంలో రక్తానికి డిమాండ్ పెరిగిపోతుంది.
డిమాండ్‌కు అనుగుణంగా రక్తం ఉత్పత్తి ఉండదు. ఈ కారణంగా తలసేమియాతో బాధ పడుతున్నవాళ్లకు తరచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తంలో అవసరానికి అనుగుణంగా అంటే 12 గ్రాములపైనే హిమోగ్లోబిన్ ఉండేలా చూసుకోవడమే సరైన చికిత్స. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. రక్తకణాలు క్షీణించిపోవడం, కొత్త రక్తం ఎక్కించే క్రమంలో ఐరన్ శరీరమంతా వ్యాపిస్తుంది. తద్వారా దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దుష్పరిణామాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తరచూ పీడియాట్రీషియన్‌ను, పీడియాట్రిక్ హిమటాలజిస్ట్ను, బాబు ఎదిగే కొద్దీ గుండె వ్యాధుల వైద్య నిపుణుడిని, ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తూ ఉండాలి. అయితే ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం కూడా ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, వారి కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ‘తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నది. వారిని సంప్రదించడం ద్వారా అవసరమైన సహాయం పొందవచ్చు.