కారేపల్లి,(కామేపల్లి) ఫిబ్రవరి 21 : ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగరేణి సీఐ ఎన్.సాగర్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న కామేపల్లి క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి పోలీసులు ప్రశ్నించారు. విచారణలో నిందితులు కామేపల్లి మండలంతో పాటు ఖమ్మం జిల్లా పరిధిలోని కారేపల్లి, ఖమ్మం 3 టౌన్, అర్బన్, రూరల్, నేలకొండపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితులు మొత్తం 13 దొంగతనం కేసుల్లో సుమారు 19 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను అపహరించినట్లు సీఐ తెలిపారు. దేవల్ల శ్రీకాంత్, పాండురంగాపురం, ఖమ్మం అర్బన్ మండలం. పాత ఇనుప కొట్టు యజమానులు పేండ్ర సురేష్, బుర్హాన్‌పురం, ఖమ్మం. సింగజోగి యాదగిరి, మామిళ్లగూడెం, ఖమ్మంను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీరి వద్ద నుండి సుమారు 100 కిలోల కాపర్ వైర్, స్కూటీ (TG 04 2014)ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించామని, వారిలో ఒకరు ఖమ్మం, ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అరెస్టు చేసిన వారిపై 303(2), 112, 317(2) BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కామేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ స్టేషన్ సిబ్బందిని, సహకారం అందించిన కారేపల్లి ఎస్ఐ బైరు గోపి, స్టేషన్ సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.