విద్యాశాఖలో వరుస అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాల చెల్లింపులో కోతలు పెట్టి డబ్బులు మింగేసిన వైనం ఇప్పటికే వెలుగుచూడగా.. ఈ క్రమంలో తవ్విన కొద్దీ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. 2025లో కోతలు పెట్టిన అధికారులు.. 2022లో ఏకంగా రెండు పేపర్ల మూల్యాంకన పారితోషికం పంతుళ్లకు ఇవ్వకుండానే స్వాహా చేసినట్టు తెలిసింది.
అలాగే ఇటీవల ‘ప్రజాపాలనప్రగతి ప్రణాళిక’లో భాగంగా సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో కొంతమంది నోడల్ అధికారులు దొరికిన కాడికి దోచుకున్నట్టు తెలుస్తున్నది. హాజరుకాని సర్పంచుల పేరిట దొంగ బిల్లులు పెట్టి నిధులను కాజేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే దందా నడవగా, ఈ వ్యవహారంలో కొంతమంది ఉన్నతాధికారుల పాత్ర సైతం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా వరుస అక్రమాలు బయటపడుతున్న తీరు విద్యాశాఖతోపాటు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2025 సంవత్సరానికి సంబంధించి పదో తరగతి జవాబు పత్రాలు దిద్దిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లింపులో కోతలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 1న ’పంతుళ్ల పారితోషికంలో కోతలు?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం కూడా విదితమే. ఈ కథనం విద్యాశాఖలో సంచలనం సృష్టించింది. అధికారుల్లో అలజడి రేపింది. విద్యాశాఖ పరంగా విచారణ జరిపిస్తున్నారా.. లేదా? అన్నది ఇంత వరకు వెల్లడించలేదు గానీ, అక్రమాలు బయటకు రాకుండా మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది.
ఇది ఇలా ఉంటే, తాజాగా మరో బాగోతం బయటపడింది. 2022 సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనానికి చేయాల్సిన పారితోషికం విషయంలో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఫిజికల్ సైన్స్‌తోపాటు బయోలాజికల్ సైన్స్ రెండు జవాబు పత్రాల పారితోషికానికి సంబంధించి ఉపాధ్యాయులకు చెల్లింపులు చేయకుండానే పూర్తిగా స్వాహా చేసినట్టు తాజాగా ప్రచారం జరుగుతున్నది. కొంతమంది ఉపాధ్యాయులు అప్పుడే దీనిపై అడిగితే.. వారిని రకరకాలుగా బెదిరించి నోరు మూయించినట్టు తెలిసింది.
అప్పటి అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అడిగిన కొంతమంది ఉపాధ్యాయులకు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పినట్టు తెలుస్తున్నది. రాగానే చెల్లింపులు చేస్తామని నమ్మిస్తూ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వీటిపై విచారణ జరిపిస్తే.. మొత్తం అక్రమాలు బహిర్గతం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణకు ఆదేశిస్తారా.. లేదా? అన్నది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
సర్పంచుల వర్క్‌షాపు పేరిట దొంగ బిల్లులు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 140 మంది వరకు సర్పంచులు ఉండగా, ఆ వర్క్‌షాపునకు కేవలం 40 మంది సర్పంచులు మాత్రమే హాజరైనట్టు తెలిసింది. కానీ, ఇక్కడ వంద శాతం హాజరైనట్టు చూపుతూ బోగస్ బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేశారు. ఈ నిధులను మంజూరు చేసే సమయంలో అధికారి అకౌంట్ నంబరును తప్పుగా పేర్కొనడంతో ఆ బిల్లులు సదరు అధికారికి వెళ్లకుండా మరొకరి బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇదే తరహాలో.. ఇదే నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మరో నియోజకవర్గంలో కేవలం 50 మంది మాత్రమే హాజరైతే, అక్కడ 110 మందికిపైగా హాజరయ్యారని బిల్లులు డ్రా చేసినట్టు తెలిసింది.
ఈ రెండు నియోజకవర్గాలే కాదు, ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఈ దందా జరిగినట్టు తెలుస్తున్నది. ‘ప్రజాపాలనప్రగతి ప్రణాళిక’ భాగంగా ఎడ్యుకేషన్ వీక్ పేరిట మే 11 నుంచి 17 వరకు కార్యక్రమాలు నిర్వహించారు. వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఒక రోజు గ్రామ సర్పంచులతోపాటు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లతో వర్క్‌షాపు నిర్వహించారు. సదరు వర్క్‌షాప్‌లో ఏయే అంశాలు చర్చించాలో ప్రత్యేక ఏజెండాను రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చింది. అంతేకాదు, ఈ వర్క్‌షాప్‌నకు హాజరైన సర్పంచులకు భోజనంతోపాటు ఇతర ఏర్పాట్లకు కలిపి రూ.300, పార్టిసిపెట్ కిట్ కింద మరో రూ.100 చొప్పున కేటాయింపులను ప్రభుత్వమే చేసింది. అంతేకాదు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల సంఖ్యను బట్టి నియోజకవర్గానికి రూ.25 వేల వరకు వెచ్చించే వెసులుబాటును కల్పించింది.
తాజాగా అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమాల పేరిట ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.70వేల నుంచి రూ.80 వేల వరకు బోగస్ బిల్లులు పెట్టి క్లెయిమ్‌లు చేసినట్టు తెలిసింది. విద్యాశాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్క్‌షాపు నిర్వహణకు ప్రైవేట్ విద్యాసంస్థలనే వినియోగించారు. సదరు యాజమాన్యాలే కావాల్సిన నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాయి. కానీ, మొత్తం విద్యాశాఖ నుంచే చెల్లింపులు చేసినట్టు చూపి, క్లెయిమ్ చేశారని తెలుస్తున్నది. ఆయా నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించారు. ఉమ్మడి జిల్లాలో కొంతమంది నోడల్ అధికారులు వాస్తవికంగా క్షేత్రస్థాయిలో జరిగిన బిల్లులను మాత్రమే పెట్టగా, ఎక్కువ మంది మాత్రం అన్నీ తప్పుడు బిల్లులు సృష్టించి డబ్బులు కాజేసినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఉన్నతాధికారుల హస్తం కూడా అందులో ఉన్నట్టు తెలుస్తున్నది.
విచారణ జరిపితే అక్రమాలు బహిర్గతం!
సాధారణంగా ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ముందస్తుగా పరిమిత మొత్తమే అడ్వాన్స్‌గా విడుదల చేసి, కార్యక్రమం అనంతరం వాస్తవ హాజరు, బిల్లులు, వోచర్లు ఇతర ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మాత్రమే తుది చెల్లింపులు చేయడం ఆనవాయితీ. కానీ, బోగస్ బిల్లులు ఎక్కువగా పెట్టిన నియోజకవర్గాల పరిధిలో మాత్రం హడావుడిగా బిల్లుల మంజూరు చేసినట్టు సమాచారం. అయితే వాస్తవ హాజరు రిజిస్టర్లు, పాల్గొన్న వారి జాబితాలు, ఫొటోలు, వీడియోలు, బిల్లులు, వోచర్లు, చెల్లింపు రికార్డులు వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తే.. అందులో జరిగిన అవినీతి తతంగం మొత్తం బయటపడుతుంది.
నిజానికి ఇలాంటి వర్క్‌షాపుల కార్యక్రమాల వ్యయాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించడం, అక్రమంగా చెల్లించిన నిధులు ఉన్నట్టయితే బాధ్యుల నుంచి రికవరీ చేయడం, తప్పుడు క్లెయిమ్‌లు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లేదా ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. ప్రజాధనాన్ని పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రధాన బాధ్యత. కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా గరిష్ఠ యూనిట్ వ్యయాన్ని క్లెయిమ్ చేయడం ఒక ఆనవాయితీగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.