– త్రుటిలో తప్పిన ప్రమాదం
– ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారుల విజ్ఞప్తి
రుద్రంపూర్, సెప్టెంబర్ 11 : రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై ఉన్న మూలమలుపు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మరో ప్రమాదం త్రుటిలో తప్పింది. రోడ్డుపై వస్తున్న వ్యక్తిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.వి. వెంకటరమణ, ఎస్ఓ టు జీఎం గోవిందరావు తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న మూలమలుపు గతంలోనూ పలు ప్రమాదాలకు వేదికైంది. ఈ నెల 6న విధులకు వస్తున్న పంప్ ఆపరేటర్ ఎస్. నాగేశ్వరరావును కారు ఢీకొనడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కారు–ఆటో ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడగా, ఓ మహిళ అంగవైకల్యానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో చండ్రుగొండకు చెందిన వ్యక్తి మృతి చెందడంతోపాటు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలోనూ ప్రాణనష్టం సంభవించినట్లు పేర్కొన్నారు.

రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద మరో ప్రమాదం
ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు సంఘటనా స్థలాలను పరిశీలిస్తున్నప్పటికీ, ప్రమాదాల పునరావృతిని అరికట్టేందుకు శాశ్వత చర్యలు అవసరమని వాహనదారులు కోరుతున్నారు. జాతీయ రహదారి అధికారులు, పోలీసులు సమన్వయంతో మూలమలుపును పరిశీలించి వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నెలవారీ క్రైమ్ మీటింగ్లలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యలు కొనసాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులు మారుతున్నా ప్రమాదకర ప్రాంతాల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుద్రంపూర్ ప్రగతివనం నుండి పాత జీఎం కార్యాలయం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో విధులకు వెళ్లే కార్మికులు, వాహనదారులకు వెలుతురు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణకు కొంతమేర దోహదపడుతుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు.