New Delhi : ఢిల్లీలో ఒక అరుదైన వైద్య ఘటన జరిగింది. స్త్రీలలో మాత్రమే ఉండే గర్భసంచి.. ఒక 26 ఏళ్ల యువకుడిలో గుర్తించారు. ఇదో అరుదైన శారీరక లక్షణమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఒక యువకుడు సంతానలేమి సమస్యతో ఇటీవల ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లాడు. అక్కడ ప్రత్యేక వైద్య నిపుణులు అతడికి పలు పరీక్షలు నిర్వహించారు. అతడికి మగవారికి లాగే అవయవాలు, ఇతర లక్షణాలు సాధారణంగానే ఉన్నాయి.
కానీ, కొన్నింటిలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. అతడికి రెండు వృషణాలు లేవు. అలాగే, వీర్య పరీక్ష నిర్వహించగా శుక్రకణాలు అస్సలు లేవని తేలింది. దీంతో అతడికి వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. క్రోమోజోమ్ పరీక్ష నిర్వహించగా మగవారికి ఉండే ఎక్స్వై మేల్ క్రోమోజోమ్లే ఉన్నాయి. ఈ విషయంలో ఎలాంటి లోపం లేదు. అనంతరం అతడికి ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించగా షాకింగ్ విషయం బయటపడింది. అదే.. అతడికి గర్భసంచి ఉండటం. అది కూడా మహిళల్లాగే పూర్తిస్థాయి గర్భసంచిని అతడి కడుపులో వైద్యులు గుర్తించారు.
అలాగే, వృషణాలు కూడ గర్బసంచి లోపల ఉన్నాయి. అవి కూడా మహిళల్లో ఉండే అండాలలాగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇలా మగవారిలో గర్బసంచి, అండాలు ఉండటాన్ని వైద్య పరిభాషలో పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ (పీఎండీఎస్) అంటారని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది చాలా అరుదైన లక్షణమని అన్నారు. వారు మగవారిలాగే, ఇతర అవయవాలు, లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ గర్భసంచి, అండాలు కలిగి ఉంటారని వైద్య నిపుణులు వివరించారు. ఇక, వీర్యంలో శుక్రకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారని కూడా వైద్యులు తెలిపారు. వీరికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువే ఉంటాయన్నారు.
ఈ అరుదైన లక్షణాలు బయటపడ్డ వ్యక్తిలోని గర్భసంచిని, వృషణాల్ని తొలగించామని వైద్యులు తెలిపారు. దీనికి కారణం ఉందన్నారు. ఇవి ఇలాగే ఉండిపోతే.. అవి క్యాన్సర్కు దారి తీసే అవకాశం ఉందని, అందుకే వాటిని అతడి శరీరం నుంచి తొలగించామని చెప్పారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. అతడి గర్భసంచి, వృషణాల్ని పరీక్షల కోసం పంపించామన్నారు.