పెన్‌పహాడ్, సెప్టెంబర్ 11 : ప్రభుత్వ గురుకులంలో చదివి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన పెన్పహడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి ఇందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఇందు నిరూపిస్తూ మెడికల్ సీట్ సాధించడం అభినందనీయం పేర్కొంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతారం గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, ప్రసన్న దంపతుల కుమార్తె అయిన ఇందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్ ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదివి అంగ వైకల్యాన్ని అధిగమించి కష్టపడి చదివి NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఇందు తండ్రి అంజయ్య దివ్యాంగుడు కాగా, ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి ప్రసన్న దినసరి కూలీ. ఆర్థికంగా పేద కుటుంబానికి చెందినప్పటికీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇందు తన చదువుపై దృష్టి పెట్టి ముందుకు సాగిందని పేర్కొంటూ పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ ఎన్నో కష్టాలను అధిగమించి పట్టుదలతో చదివి NEETలో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు పొందడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఇందు తన చదువును విజయవంతంగా పూర్తి చేసి మంచి వైద్యురాలిగా ఎదిగి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సేవలందించాలని ఎస్పీ ఆకాంక్షించారు. కష్టపడి చదివే విద్యార్థులకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు విద్యాభ్యాసానికి సంబంధించి భవిష్యత్‌లోనూ ఏదైనా సహాయం లేదా సమస్య ఎదురైతే తనను సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు అండగా ఉంటానని ఎస్పీ నరసింహ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.