ముంబై: వేగంగా ప్రయాణించిన ఒక వ్యాన్, పెట్రోల్ బంకు నుంచి బయటకు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాన్‌లో ఉన్నవారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. (Truck-Pickup Van Collision) మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున నాగ్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారిలో ఉన్న పింపల్గావ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకు నుంచి హైవేపైకి వస్తున్న ఒక లారీని అతివేగంతో వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. 9 మంది మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సకోలి సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు హైవే సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు బొలెరో వాహనం అతివేగంగా ప్రయాణించినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. లారీని ఢీకొట్టే ముందు వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.