Rudrampur | రుద్రంపూర్: దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించేందుకు విశేషంగా కృషి చేసిన జాతిపిత (Father of the Nation) మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. కానీ సింగరేణి సంస్థలో మాత్రం గాంధీజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించకపోవడంపై పలువురు కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థలో ఇతర ప్రముఖుల జయంతి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థలో మాజీ మంత్రి, దివంగత పీ శ్రీపాదరావు, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కార్మికులు గుర్తుచేస్తున్నారు. ప్రజా జీవితంలో సేవలందించిన ప్రముఖుల జయంతులను అధికారికంగా నిర్వహించడం మంచిదేనని, దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ జయంతికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
గాంధీజీకి ఎందుకు ప్రాధాన్యం లేదు?
సింగరేణి సంస్థలో వివిధ ప్రముఖుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి విషయంలో మాత్రం కార్యక్రమాలు లేకపోవడానికి కారణమేంటని కార్మికులు మండిపడుతున్నారు. గాంధీ జయంతిని సెలవు దినంగా ప్రకటించినప్పటికీ సంస్థ పరిధిలోని ఏరియాలు, కార్యాలయాల్లో అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.
ఏటా నిర్వహించాలి
మహాత్మా గాంధీ జయంతిని కేవలం సెలవు దినంగా పరిమితం చేయకుండా.. సింగరేణి వ్యాప్తంగా ఏటా అధికారికంగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు ఈ అంశంపై స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సర్క్యులర్ రాలేదు
ఈ విషయమై కొత్తగూడెం ఏరియా పర్సనల్ మేనేజర్ తిరుపతిని వివరణ కోరగా.. గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకునేందుకు తమకు ఎలాంటి సర్క్యులర్ రాలేదని అన్నారు. దీంతో గాంధీ జయంతి కార్యక్రమాల నిర్వహణపై సంస్థ ఉన్నతస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు.