పల్నాడు జలధార.. మరో పోతిరెడ్డిపాడు!.. తెలంగాణ గర్భశోకం
ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. ఒకరు ఒకసారి మోసపోవచ్చు.. కానీ అదే చారిత్రక మోసం.. రెండోసారీ అదే వ్యూహంతో మొదలైందంటే?! ఇదేదో యాదృచ్ఛికం కాదు! ‘తాగునీటి అవసరాలు’ అనే సాకు అంతకన్నా కాదు!!
- మేల్కొనకపోతే రాష్ట్రం ఎడారే
- నాడు-నేడు మన నీటి హక్కులకు పాతర వేసిన పచ్చ-కాంగ్రెస్
- తాగునీటి మాటున ఏపీ భారీ కుట్ర .. కాంగ్రెస్-టీడీపీ కలిసి రాష్ర్టానికి దగా
- బచావత్ ట్రిబ్యునల్ వద్దన్నా చెన్నైకి తాగునీరంటూ ‘తెలుగుగంగ’కు పునాది
- శ్రీశైలం నుంచి 1,500 క్యూసెక్కులతో పిల్ల కాలువలా మొదలైన పోతిరెడ్డిపాడు
- ఇప్పుడు 80 వేల క్యూసెక్కుల వరదతో కృష్ణమ్మను మలుపుకొంటున్న ఆంధ్రా
- ఇప్పుడవే పార్టీల కుమ్మక్కు.. శ్రీశైలం దిగువన సాగర్‌కు తాగునీటి పేరిట గండి
- కండ్లముందు జరుగుతున్న పనులను ఆపలేక.. గత ప్రభుత్వంపై రేవంత్ నెపం
గుట్టు రట్టయ్యాక.. బట్టకాల్చి మీదెయ్యాలె! అడ్డంగా దొరికిపోయాక.. ఉల్టా బురదజల్లాలె! నీటిదొంగలకు సద్దులు కట్టిన విషయం బయటపడ్డాక.. నెపం మందిమీద వేయాలె! పచ్చి అబద్ధమని తెలిసినా పదే పదే అదే చెప్పాలె. వచ్చి మూడేండ్లయినా పాత ప్రభుత్వంపై పడి ఏడ్వాలె. ‘పల్నాడు జలధార’ విషయంలో అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడదే చేస్తున్నది. సమైక్య పాలన నుంచి నేటిదాకా కృష్ణా నీటిని చెరపట్టే విషయంలో టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు సుస్పష్టం. తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు, పల్నాడు.. తాగునీటి అవసరాల ముసుగులో ఇద్దరూ కలిసి తెలంగాణ వెన్నులో దించిన ఖడ్గాలే.
ఎవరు నిజం?
వాటర్‌గ్రిడ్ విషయం తెల్వదు
ఏపీ చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం విషయం ఇప్పటివరకు మాకు తెలియదు. విషయం నా దృష్టికి రాగానే నాగార్జునసాగర్ ఈఈ మల్లికార్జున్ మీద సీరియస్ అయ్యాను.

నువ్వు ఆంధ్రా వాడివని సైలెంట్‌గా ఉన్నవా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాను. సంవత్సరం నుంచి పనులు జరుగుతుంటే ఏం చేస్తున్నావని ఈఈని నిలదీశాను.
-ఈ నెల 18న హైటెక్స్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మాకెప్పుడో తెలుసు!
ఏపీ చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం గురించి మాకు ఎప్పుడో తెలుసు. పనుల గురించి కూడా ఎప్పుడో తెలిసింది. దానిపై ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. లేఖలు రాశాం. ఏపీ పనులను అడ్డుకుని తీరుతం.

– ఈనెల 18న సచివాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్
కేసీఆర్‌కే తెలుసు
జగన్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు కేంద్రం అనుమతిని ఇచ్చింది. తెలిసీ కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పటి పనులకు అప్పటి ప్రభుత్వానిదే తప్పు.
– సోమవారం మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్
పల్నాడుపై ప్రశ్నించాం : రాష్ట్ర ఈఎన్సీ
అనుమతులు లేకుండా పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టడాన్ని కృష్ణా బోర్డు మీటింగులో లేవనెత్తాం. జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టిన ఆ పనుల విషయం తమకు కూడా తెలియదని ఏపీ ఇంజినీర్లు చెప్పారు.
చర్చకే రాలేదు : ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ
పల్నాడు వాటర్ గ్రిడ్‌పై సోమవారం జరిగిన కృష్ణారివర్ బోర్డు సమావేశంలో ఎలాంటి చర్చా జరుగలేదు. అది కేంద్ర ప్రభుత్వ పథకం. అన్ని రిజర్వాయర్లలో ఆ మేరకు పనులు జరిగినయ్. ఇవ్వాళ్టి మీటింగ్‌లో ఆ అంశాలేవీ చర్చకు రాలేదు.
(గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. ఒకరు ఒకసారి మోసపోవచ్చు.. కానీ అదే చారిత్రక మోసం.. రెండోసారీ అదే వ్యూహంతో మొదలైందంటే?! ఇదేదో యాదృచ్ఛికం కాదు! ‘తాగునీటి అవసరాలు’ అనే సాకు అంతకన్నా కాదు!! మానవత్వం పేరిట పిల్ల కాలువతో నాడు పురుడుపోసుకున్న పోతిరెడ్డి‘పిడుగు’ ఇప్పుడు తెలంగాణకు చుక్కనీరు దక్కకుండా ఒక జీవనదినే మళ్లించుకుపోయే చారిత్రక ద్రోహంలా మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్-టీడీపీ ప్రభుత్వాలు ఇక్కడి రాజకీయ అసమర్థతను ఆసరాగా చేసుకొని తెలంగాణపై జల ఖడ్గాన్ని దూశాయి. ఇప్పుడు అదే ముసుగులో ఆ రెండు పార్టీలూ కలిసి అదే అస్ర్తాన్ని సంధిస్తున్నాయి. నాడు ఎగువన శ్రీశైలం జలాశయం దగ్గర పూర్తి చేసిన జల క్రీడను నేడు నాగార్జునసాగర్ వేదికగా మొదలుపెట్టాయి. పేరుకు పల్నాడు వాటర్ గ్రిడ్.. అంటే రోజుకు మిలియన్ లీటర్ల నీటి తరలింపు మాత్రమే. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా కోసం దశాబ్దాల కిందట చేపట్టిన తెలుగు గంగ కాలువ సామర్థ్యం 1,500 క్యూసెక్కులే. తెలంగాణ నిస్సహాత చివరికి పోతిరెడ్డిపాడులా తయారై చెల్లించుకుంటున్న మూ ల్యం రోజుకు తొమ్మిది టీఎంసీలతో కృష్ణా నదినే మళ్లించుకునేలా చేసింది. నాగార్జునసాగర్ వద్ద పల్నాడు తాగునీటి పథకం రూపంలో పడిన గండి రేపు నాగార్జునసాగరాన్ని మళ్లించుకునేంతగా రూపొంతరం చెందదనే గ్యారెంటీ ఏమున్నది?
అప్పుడంటే ఉమ్మడి ఏపీ. ఆరు దశాబ్దాలపాటు సీమాంధ్ర నాయకుల ఏలుబడిలో కనీసం నోరెత్తి మాట్లాడలేని అసమర్థ, నిస్సహాయ తెలంగాణ రాజకీయ నాయకత్వంతో శ్రీశైలం దగ్గర సరిదిద్దలేని, సరిదిద్దుకోలేని అన్యాయం జరిగింది. ఇప్పుడేమైంది?! ప్రత్యేక తెలంగాణ.. పదేండ్ల ఉమ్మడి రాజధానిలోనే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తొడగొట్టిన వాళ్లను సైతం పలాయనం చిత్తగించేలా చేసిన సమర్థవంతమైన నాయకత్వం ఉన్న రాష్ట్రం. కానీ గత మూడేండ్లలోనే నాటి దేబరింపులే ఎందుకు పునరావృతమవుతున్నాయి? నిన్నటి బనకచర్ల అయినా.. తాజా పల్నాడు తాగునీటి పథకమైనా.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకపక్ష దూకుడుకు జేజేలు కొడుతున్నది ఎవరు? ఏడాది కిందట ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు ఆంధ్రప్రదేశ్ గండికొట్టినా తమకు తెలియదన్నట్టు.. ఎందుకు చెప్పలేదంటూ ఇంజినీర్ల మీద కారాలుమిరియాలు నూరడం వెనుక ఆంతర్యమేంది? చివరికి మరోసారి పురుడుపోసుకున్న ఇంకో చారిత్రక ద్రోహాన్ని అడ్డుకోకుండా.. పొరుగు రాష్ట్ర కుట్రపై పల్లెత్తు మాట అనకుండా.. ఇది బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందంటూ ఎందుకీ దాటవేత ధోరణి?
***
చరిత్ర పునరావృతమవుతుంది (హిస్టరీ రిపీట్) అంటారు. చరిత్ర తనకు తానే పునరావృతం కాదు. కొందరు వ్యక్తులు.. కొన్ని వ్యవస్థలు చరిత్రను పునరావృతం చేస్తాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్-టీడీపీ ఒకదాని వెనుక ఒకటి అధికారంలోకి వచ్చి పోతిరెడ్డిపాడు పొక్కను వెడల్పు చేస్తే! నేడు తెలంగాణలో అదే కాంగ్రెస్, ఏపీలో టీపీడీ ఏలుబడిలోనే పల్నాడు తాగునీటి పథకం మొదలైంది.
***
తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు ప్రాణాధారమైన నాగార్జునసాగర్‌ను ఆధునిక దేవాలయంలా నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు రెగ్యులేటెడ్ రిలీజెస్ (అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల) కోసం హైడల్ ప్రాజెక్టుగా శ్రీశైలం ప్రాజెక్టును కట్టారు. కానీ చివరికి శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాలు పెన్నా బేసిన్లో తాగు, సాగునీటికి ప్రత్యామ్నాయంగా మారాయి. ఇందుకు ప్రధాన కారణం తెలుగు గంగ ప్రాజెక్టు. ఇప్పుడు చెన్నై.. గతంలో మద్రాసు నగర తాగునీటి అంశం తెరపైకి వచ్చినప్పుడే శ్రీశైలం జలాశయానికి గ్రహణంలా మారింది. మద్రాసు నగరానికి తాగునీటిని ఎలా అందించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకులు తాము కృష్ణాజలాలు ఇస్తామంటూ ముందుకొచ్చి ప్రకటించారు.
కృష్ణా బేసిన్లో కృష్ణాజలాల్ని పంపిణీ చేసిన బచావత్ ట్రిబ్యునల్ ముందు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ జస్టిస్ బచావత్ మాత్రం దీన్ని సున్నితంగా తిరస్కరించారు. మద్రాసు నగరానికి కృష్ణా నది నుంచి నీళ్లివ్వడమేందని ప్రశ్నించారు. అందుకే బచావత్ ట్రిబ్యునల్‌లో మద్రాసు నగర తాగునీటికి ఎలాంటి కేటాయింపులు జరుపలేదు. అయినా సమైక్య పాలకులు ఆ బాధ్యతను భుజాన వేసుకొని రెగ్యులేటెడ్ రిలీజెస్ కోసం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుకు గండి పెట్టేందుకు సిద్ధమయ్యారు. మానవతా దృక్పథం అంటూ చివరికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలను సైతం ఈ ఉచ్చులోకి దింపారు. ప్రతి రాష్ట్రం తరఫున ఐదు టీఎంసీలు.. అంటే ఏటా 15 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి అప్పటి మద్రాసు తాగునీటి అవసరాలకు తరలించేందుకు తెలుగు గంగ ప్రాజెక్టు చేపట్టారు.

వ్యూహాత్మకంగా తెలంగాణకు ద్రోహం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు చెరో ఐదు టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలు మద్రాసు నగర తాగునీటికి ఇవ్వాలని 1976లో తొలుత ఒప్పందం జరిగింది. కానీ కృష్ణా నదిపై ఎక్కడి నుంచి తీసుకోవాలనే దానిపై దానిలో ఎలాంటి స్పష్టత లేదు. తిరిగి 1977లో జరిగిన ఒప్పందంలో శ్రీశైలం నుంచి తీసుకోవాలనే అంశాన్ని చేర్చారు. కేవలం 1500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో అదీ లైనింగ్ చేసిన కాలువ ద్వారా ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో శ్రీశైలం నుంచి 15 టీఎంసీలను తరలించాలనేది ఆ ఒప్పంద సారాంశం. కానీ ఇన్ని దశాబ్దాల్లో ఏనాడైనా మద్రాసు నగరానికి ఏటా 15 టీఎంసీలు కాదు కదా.. ఐదారు టీఎంసీలు కూడా పోవడం లేదు. ఇన్నేండ్ల రికార్డులను పరిశీలిస్తే గరిష్ఠంగా ఒక ఏడాది ఎనిమిది టీఎంసీల నీళ్లు మద్రాసు తాగునీళ్ల కోసం ఆ నగర సమీపంలోని పూంచి రెగ్యులేటర్ దగ్గరకు చేరుకున్నట్టు స్పష్టమవుతున్నది. మరి మానవతా దృక్పథం.. ఓ నగర దాహార్తి అన్న పాలకులు 1996 నుంచి 2014 వరకు ఏనాడూ పూర్తిస్థాయిలో మద్రాసుకు నీళ్లు ఇవ్వలేదంటే వాళ్ల ఉద్దేశం ఆ నగర తాగునీటి అవసరాలు కాదనేది సుస్పష్టం.
పైగా శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు నిర్మించిన కాలువ ఆఫ్‌టేక్‌ను వ్యూహాత్మకంగా పెన్నా నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. అందుకే చెన్నైకి నీళ్లియ్యకుండా ఏటా శ్రీశైలం నుంచి వచ్చే నీటిని పెన్నా బేసిన్లో తాగు, సాగునీటి అవసరాలకు వాడటం మొదలుపెట్టారు. తొలుత లైనింగ్ చేసిన 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మాణం అని ఒప్పందంలో ఉండగా.. ఆపై ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో దాన్ని విస్తరిస్తూ ఇప్పుడు 88 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పోయేలా తయారు చేశారు. శ్రీశైలం నుంచి మద్రాసు నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టు మొదలైతే.. ఆపై శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) అని చేపట్టారు. దానికి 19 టీఎంసీల కేటాయింపు ఉన్నది. అంటే తెలుగుగంగ, ఎస్సార్బీసీకి కలిసి మొత్తం 34 టీఎంసీలు (15+19) మాత్రమే శ్రీశైలం నుంచి తరలించాలి. కానీ కాలానుగుణంగా తెలుగు గంగ ప్రాజెక్టుకు 29 టీఎంసీల కేటాయింపు చేశారు. ఆపై గాలేరు నగరి సుజల స్రవంతి అని మరో 39 టీఎంసీలకు ప్రాజెక్టును నిర్మించారు. హైలెవల్ కెనాల్ పేరిట మరో 10 టీఎంసీలుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఆవిరి నష్టాల కింద మరో మూడు టీఎంసీలు.. ఇలా ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు 114 టీఎంసీల హక్కు ఉన్నదంటూ ఏపీ వాదిస్తున్నది.
కృష్ణా నది బనకచర్ల క్రాసింగ్ దగ్గరకు వెళ్లగానే మూడు పాయలుగా..
మొత్తంగా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా తరలిపోయే కృష్ణా నది బనకచర్ల క్రాసింగ్ దగ్గరకు వెళ్లగానే మూడు పాయలుగా (ఎస్సార్బీసీ-తెలుగు గంగ-గాలేరు నగరి సుజల స్రవంతి) విడిపోయి రాయలసీమ పరిధిలోని పెన్నా బేసిన్‌కు పుష్కలమైన తాగు, సాగునీటిని అందిస్తున్నది. ఇలా శ్రీశైలం నుంచి నదిని మళ్లించుకుపోతున్నందునే పెన్నా బేసిన్లో కృష్ణాజలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకంగా 351 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారు. అంటే సంబంధంలేని పెన్నా బేసిన్లో 351 టీఎంసీల కృష్ణాజలాలను నిల్వ చేసుకునే రిజర్వాయర్లు ఉంటే.. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ జిల్లాల్లో పట్టుమని పది టీఎంసీలను నిల్వ చేసే సామర్థ్యం కూడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిల్వ సామర్థ్యాన్ని దాదాపు వంద టీఎంసీలకు పైగా పెంచారు.
మరో పోతిరెడ్డిపాడులా పల్నాడు వాటర్ గ్రిడ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందట పల్నాడు వాటర్ గ్రిడ్ పేరిట చేపట్టిన మంచినీటి పథకం కోసం నాగార్జునసాగర్‌కు గండి పెట్టింది. జలాశయంలో 493.4 నీటిమట్టం దగ్గర నుంచి కృష్ణాజలాలను సేకరించేలా ఇన్‌టేక్ పాయింట్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతి ఏటా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి పల్నాడు, ఇతర ప్రాంతాల తాగునీటి కోసం నీళ్లు సేకరిస్తుంది. కానీ ప్రత్యేకంగా వాటర్ గ్రిడ్ పేరిట నేరుగా సాగర్ జలాశయానికే గండి కొట్టడం అనుమానాలకు తావిస్తున్నది. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాగునీటి పథకాన్ని చేపట్టే ముందు తెలంగాణకైనా కనీసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకైనా సమాచారం ఇచ్చేది. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఈ పథకాన్ని చేపడుతుండటం, కనీసం ప్రారంభోత్సవాన్ని నిర్వహించకపోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. ఈ వాటర్ గ్రిడ్ పథకంలో పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తున్నారని, గతంలో తెలుగు గంగ ప్రాజెక్టులో ఓపెన్ కాలువ నిర్మాణం జరిగినందున దాన్ని క్రమంగా విస్తరించేందుకు సాధ్యమైందని పలువురు వాదిస్తున్నారు.
కానీ ఒక్కసారి జలాశయానికి గండి కొట్టి ఇన్‌టేక్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తే మున్ముందు దాని ఆధారంగా నీటిని తరలించుకుపోవడమనేది సులువు. దీంతో ఇప్పుడు పైపులైన్గా ఉన్నది రేపు ఓపెన్ కాలువ కాదనే గ్యారెంటీ ఏమీలేదనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు సాగర్ కుడి కాలువ వాస్తవ ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. కానీ లైనింగ్ చేయడం వల్ల ఇప్పుడు దాని ప్రవాహ సామర్థ్యం 24,606 క్యూసెక్కులుగా ఉన్నదని తెలిసింది. ఇక.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించుకుపోవాలంటే కృష్ణా బోర్డు అనుమతి కావాలి. అనుమతి లేకుండా తీసుకుపోతే తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. కానీ పల్నాడు తాగునీటి పథకంలో ఏడాది పొడవునా నీటిని తరలించుకుపోవచ్చు. అదేమంటే.. తాగునీటి పథకం కదా! దానికీ లెక్కలు కడుతారా? అంటూ సెంటిమెంట్‌ను వినిపించే అవకాశమూ ఉన్నది. దీంతో ఇప్పుడు రోజుకు మిలియన్ లీటర్లలో ఉన్న పల్నాడు గండి రేపు.. ఎల్లుండి ఎన్ని క్యూసెక్కులు, రోజుకు ఎన్ని టీఎంసీలకు పెరుగుతుందో కాలమే చెప్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

