డ్రాతో సరి తొలి టెస్టులో తేలని ఫలితం
న్యూజిలాండ్ గడ్డపై పరుగులు వరద పారించి.. రికార్డు స్కోరుతో హోరెత్తించినా భారత్‌ను విజయం వెక్కిరించింది. బేసిన్ రిజర్వ్ పిచ్ పూర్తి నిర్జీవంగా మారడంతో బౌలర్ల శ్రమ వృథా అయింది.
- భారత విజయాన్ని అడ్డుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ గడ్డపై పరుగులు వరద పారించి.. రికార్డు స్కోరుతో హోరెత్తించినా భారత్‌ను విజయం వెక్కిరించింది. బేసిన్ రిజర్వ్ పిచ్ పూర్తి నిర్జీవంగా మారడంతో బౌలర్ల శ్రమ వృథా అయింది. ఆఖరి రోజు ఆతిథ్య బ్యాటర్లు పక్కా టెస్టు జిడ్డు ఆటతో పోరాడగా.. విజయానికి అవసరమైన 8 వికెట్లను బౌలర్లు పడగొట్టలేకపోవడంతో తొలి టెస్టును భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. సోమవారం ముగిసిన ఈ పోరులో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (165 బంతుల్లో 65), డారిల్ మిచెల్ (186 బంతుల్లో 49 నాటౌట్),
రచిన్ రవీంద్ర (129 బంతుల్లో 37), గ్లెన్ ఫిలిప్స్ (126 బంతుల్లో 26 నాటౌట్) మొండి పట్టుదలతో క్రీజులో పాతుకుపోయి తమ జట్టుకు ఓటమి తప్పించారు. 119/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 239/5 వద్ద ఉన్నప్పుడు ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 720/9 వద్ద డిక్లేర్ చేసి 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా, పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించకపోవడంతో విజయం దక్కలేదు. హెన్రీ నికోల్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నెల 27న క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు మొదలవనుంది.
75 ఓవర్లలో 120 పరుగులే
ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి 233 పరుగులు వెనుకంజతో ఆఖరి రోజు బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు సమయాన్ని గడపడమే లక్ష్యంగా ఆడారు. రోజంతా 75 ఓవర్లు ఎదుర్కొని 120 పరుగులే చేశారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు కాన్వే, రచిన్ కీలకమైన తొలి గంటలో వికెట్ కాపాడుకుం ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి భారత బౌలర్లను విసిగించారు. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (1/64) కాన్వేను బోల్తా కొట్టించి ఈ జోడీని విడదీశాడు. కాన్వే బ్యాట్-ప్యాడ్‌కు తగిలి పైకి లేచిన బంతిని కీపర్ పంత్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. ఐదు ఓవర్ల తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని కట్ చేయబోయిన రచిన రెండో స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుపై ప్రభావం..
ఈ డ్రాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్ అవకాశాలకు కొంత ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో స్థానంలో ఉన్న భారత పాయింట్ల శాతం 51.52 నుంచి 50కి తగ్గింది న్యూజిలాండ్ 66.67 శాతంతో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా, సౌతాఫ్రికా (75 శాతం) అగ్రస్థానంలో, ఆస్టేల్రియా (69.23 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.
మిచెల్, ఫిలిప్స్ అడ్డుగోడ
లంచ్ విరామం నుంచి వచ్చిన కొద్దిసేపటికే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్ (15) కీపర్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, మిచెల్, ఫిలిప్స్ తమ వైట్‌బాల్ క్రికెట్ శైలిని పక్కనపెట్టి అసలైన టెస్ట్ డిఫెన్స్‌ను ప్రదర్శించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. పాత బంతిని సుందర్ పెద్దగా టర్న్ చేయలేకపోవడంతో కివీస్ బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. ఇక టీ బ్రేక్ కు ముందు రెండో కొత్త బంతి వచ్చిన తర్వాత బుమ్రా, ఆకాశ్ దీప్ దాడి చేసినా.. మిచెల్, ఫిలిప్స్ డెడ్ డిఫెన్స్‌తో అడ్డుగోడగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 313 బంతులు ఎదుర్కొని అజేయంగా నిలవడంతో కివీస్ ఓటమి నుంచి గట్టెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

