లక్నో: వివాహిత మహిళ, ఒక వ్యక్తి కలిసి భార్యాభర్తలుగా పేర్కొంటూ ఒక హోటల్ రూమ్‌లో బస చేశారు. అయితే వారిద్దరూ అనుమానాస్పదంగా మరణించారు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Woman, Man Suicide in hotel) ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నోయిడాకు చెందిన వివాహితురాలైన 46 ఏళ్ల పింకీ, శ్రావస్తికి చెందిన 27 ఏళ్ల రింకూకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
కాగా, సెప్టెంబర్ 22న భార్యాభర్తలుగా పేర్కొని బహ్రైచ్‌లోని ఒక హోటల్ గదిలో పింకీ, రింకూ బస చేశారు. రెండు రోజుల పాటు వారు అందులో ఉన్నారు. సెప్టెంబర్ 24న ఉదయం నుంచి వారి రూమ్‌లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానించారు. వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ రూమ్ గదిని తెరిచి చూడగా వారిద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో వారిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే పింకీని నోయిడా నుంచి రింకు తీసుకువెళ్లాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. వారి మరణాలకు సంబంధించిన పరిస్థితులను నిర్ధారించడానికి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.