Inavolu | ఐనవోలు (హనుమకొండ): దళితులు, నిరుపేదల అమాయకత్వం, వారి పేదరికాన్ని ఆసరా చేసుకొని కొంతమంది దళారీల ప్రమేయంతో మట్టి దందాకు పాల్పడుతున్నారు. అనుమతులను రద్దు చేయాలని సీపీఐ జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పేదలు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ప్రభుత్వం అసైన్మెంట్ భూములను ఇచ్చింది. మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటో తేల్చాలని భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) హనుమకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, కొట్టపాక రవి, అయినవోలు మండల నాయకులు మాదాసి యాకూబ్ డిమాండ్ చేశారు.
ఈ అక్రమ తవ్వకాలు జరుపుతున్న వ్యవసాయ భూములను పార్టీ బృందం సందర్శించింది. సారవంతమైన, అన్ని పంటలు పండించే భూములను నాలుగైదు గజాల లోతు తవ్వుతూ ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు. మైనింగ్ అధికారులు ఎలాంటి భూమి, అనుమతి కోరిన వ్యక్తులు ఎవరు అని చూడకుండా అనుమతులు ఇవ్వరని, భూమి స్వభావాన్ని కోరినప్పుడు మండల రెవెన్యూ అధికారులు అది అసైన్మెంట్ భూమి అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరి ఒత్తిడితో మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారని ప్రజలు అనుమానం వ్యక్తం చేసినట్టు వారు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నా, భూ మాఫియా వ్యాపారుల హస్తం ఉన్నా సరే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని అన్నారు. మట్టి తీసి గుంతలుగా మార్చిన వ్యవసాయ భూమిని తిరిగి వారితోనే చదును చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిని చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు.