Jantar Mantar : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐఎం, ఏఐఎస్ఏ సహా వివిధ పక్షాల నేతలు, యువత శుక్రవారం ఆందోళన జరిగింది. అయితే, ఈ ఆందోళనల సందర్భంగా దాదాపు 1100 మందికిపైగా కార్యకర్తలు, నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ పక్షాలకు చెందిన కీలక నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ కీలక నేతలు, ఢిల్లీ మాజీ సీఎం అతిషి, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, సంజయ్ సింగ్, ఏఐఎస్ఏ ఉద్యమకారిని నేహా బోరా, సీపీఐఎం సీనియర్ లీడర్ బృందాకారత్ సహా పలువురు నేతల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు కూడా ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లగా వారిని కూడా అరెస్టు చేశారు. జంతర్ మంతర్ ప్రాంతానికి వెళ్లేందుకు అనేక చోట్ల రహదారుల్ని మూసివేశారు. అయినప్పటికీ వందల మంది అక్కడకు చేరుకున్నారు. వారిలో 1000 మందికి పైగా ఉద్యమకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో 30 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. జంతర్‌మంతర్ వద్దకు కీలక నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
దీంతో ఢిల్లీలోని ప్రతి వీధి ఒక జంతర్‌మంతర్ అయిందని సీపీఐఎం నేత బృందాకారత్ అన్నారు. మరోవైపు బీజేపీ మినహా అన్ని పార్టీలు నిరసనల్లో పాల్గొంటున్నాయని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో నేతలు నిరసన చేస్తుంటే, ముంబైలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రధానంగా నేతలు, యువత డిమాండ్ చేస్తున్నారు.