సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రమాదం అనుకోకుండా జరుగుతుంది. ఆ ప్రమాదంలో అదృష్టం బాగుంటే ఏం కాకపోవచ్చు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో.. ఆ వాహనానికి బీమా చేయించడం కూడా అంతే ముఖ్యం. ప్రమాద సమయంలో ఇటు వాహనానికి అటు వ్యక్తికి కొంత ధైర్యాన్నిచ్చేది ఇన్సూరెన్స్. అయితే గ్రేటర్లో వాహనదారులు తమ బండ్లకు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించడం లేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్తగా వాహనం కొనుగోలు చేసే సమయంలో మినహా.. ఆ తర్వాత బీమా రెన్యూవల్‌కు మెజార్టీ వాహనదారులు ఆసక్తి చూపడం లేదు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ను భారంగా భావించకుండా రెన్యూవల్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్రేటర్లో మొత్తంగా 88 లక్షల వాహనాలు ఉండగా అందులో 47 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ రెన్యూవల్ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. సుమారు 41లక్షల వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నాయి.
వీటిపై అధికారులు దృష్టి సారించారు. సాధారణంగా వాహనదారుల అవగాహన లోపాన్ని కొంతమంది ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఇన్సూరెన్స్ లేకుంటే ఎక్కువ నష్టపోయేది ఆ వాహన యజమానే. కానీ కొందరు నిర్లక్ష్యంతో ప్రమాదమేమీ జరగదులే అని ఇన్సూరెన్స్‌లు తీసుకోవడం లేదు. వేల రూపాయలతో ఇన్సూరెన్స్ తీసుకునే బదులు రూ.1000 లోపు పనైతుంది కదా అని దాటవేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఇన్సూరెన్స్ మార్గదర్శకాలతో ఆర్టీఏ అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ వాహనాలపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
తప్పని జరిమానా..!
మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే నేరంగా భావిస్తారు. మొదటిసారి పట్టుబడితే రూ.2వేల జరిమానా, రెండోసారి అయితే రూ.4వేల జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాహనాలు సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని ఏజెన్సీలు నకిలీ ఇన్సూరెన్స్‌లను సృష్టించి ఏజెంట్లతో కుమ్మక్కై వాహనదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు ఈ డాక్యుమెంట్లను సరిగా పరిశీలించకుండానే ఫిట్నెస్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలో 11 ఆర్టీఏ కార్యాలయాలు
గ్రేటర్‌పరిధిలో 11 ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. అవి హైదరాబాద్ జిల్లాలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట, చాంద్రాయణగుట్టా, బండ్లగూడ, నగరశివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్(పేట్ బషీర్‌బాగ్). రవాణా విభాగంలోని ఆటోరిక్షాలు, ట్రాలీలు, లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలకు ప్రతియేటా ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ప్రతి రోజు కార్యాలయాలకు 200 నుంచి 500 వాహనాలు ఫిట్నెస్ పరీక్షలకు వస్తుంటాయి.
ఈ సమయంలో వాహనం ఆర్సీతోపాటు చెల్లుబాటు అయ్యే బీమా పత్రం, కాలుష్య నియంత్రణ పత్రాలను అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీచేస్తారు. తక్కువ ధరకే బీమా పొందొచ్చని కొంతమంది వాహనదారులు అత్యాశకు వెళ్లి మోసపోతున్నారు. మరికొందరూ తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏదైన అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు అసలు విషయం తెలిసి వాహనదారులు లబోదిబోమనాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు డ్రైవ్ నిర్వహిస్తున్నారు.