ఆదిలాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టులో తమ భూములతోపాటు పట్టణం నుంచి వచ్చే రహదారిపోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని అనుకుంటవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులతోపాటు స్థానికులు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి చెందిన రైతుల భూములు 871 ఎకరాలు ఎయిర్‌పోర్టులో పోతున్నాయని, రోడ్డు సేకరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నదని, ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని కోరారు. భూములు ఎయిర్‌పోర్టులో పోతే వందలాది మంది రైతులు భూమిలేని వారు అవుతారని, రోడ్డును సేకరిస్తే రోజు ఆదిలాబాద్ పట్టణానికి కూలీ పనులు, చిరు ఉద్యోగాలు చేసేవారికి ఉపాధి లేకుండా పోతుందన్నారు.
నోటీసులు లేకుండా సర్వే నిర్వహించొద్దు..
ప్రస్తుతం తాము ఆదిలాబాద్ పట్టణానికి రావాలంటే కేవలం రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నామని, రోడ్డుపోతే నూతనంగా నిర్మించే రోడ్డు మీదుగా 16 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. తాము అభివృద్ధికి అడ్డం కాదని, భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, రోడ్డుతోపాటు అనుకుంటను పూర్తిస్థాయిలో సేకరించాలని, ఎయిర్‌పోర్టులో స్థానికుల ఉద్యోగాలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు, దినసరి పనులు చేసుకొనే వారికి ఉపాధి కల్పించాలని కోరారు. తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు అప్పులు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్నారని ఇండ్లు పోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు లేకుండా సర్వేలను నిర్వహించొద్దని, తమ డిమాండ్లపై అధికారులు చర్చించి భూ సేకరణ జరపాలని స్థానికులు కోరారు.
అధికారులు స్పష్టత ఇవ్వాలి..
విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి అనుకుంటకు వచ్చే రోడ్డు ఎయిర్‌పోర్టులో పోతున్నదని ప్రచారం జరుగుతున్నది. దీంతో రైతులతోపాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఇండ్లు, రోడ్డుకు సంబంధించి అధికారులు గ్రామస్థులతో చర్చించి స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణం రెండు కిలోమీటర్ల దూరం ఉండగా, ఉన్న రోడ్డు పోతే 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగడంతోపాటు రోజువారి పనులు చేసుకునే వారికి ఉపాధి లేకుండా పోతుంది.
– అశోక్, అనుకుంట
70 మంది భూములు కోల్పోతున్నారు
మా గ్రామంలో 1200 ఎకరాల వరకు భూములు ఉండగా.. 871 ఎకరాలను ఎయిర్‌పోర్టులో తీసుకుంటామని అంటున్నారు. దీంతో గ్రామంలో 70 శాతం మంది రైతులు భూములను కోల్పోవాల్సి వస్తుంది. వందలాది మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. భూసేకరణతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 6 కోట్లతోపాటు ఎయిర్పోర్డులో ఉద్యోగం వ్యవసాయ కూలీలు, రోజువారి పనులు చేసుకునే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. రైతుల సూచనలను అధికారులు పరిగణలోకి తీసుకొని అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
– సుధాకర్, రైతు, అనుకుంట